Share News

బీసీ స్టడీ సర్కిల్‌ నిర్వీర్యం!

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:49 AM

బీసీ స్టడీ సర్కిల్‌...ఒకప్పుడు పోటీ పరీక్షలకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థులతో కళకళలాడుతుండేది.

బీసీ స్టడీ సర్కిల్‌ నిర్వీర్యం!

గతంలో ఏటా వందలాది మందికి పోటీ పరీక్షల్లో ఉచితంగా శిక్షణ

నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో బోధన

శిక్షణ కాలంలో భృతి

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నీ బంద్‌...చివరి ఆరు నెలల్లోనే కాస్త హడావుడి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

బీసీ స్టడీ సర్కిల్‌...ఒకప్పుడు పోటీ పరీక్షలకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థులతో కళకళలాడుతుండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలవెలబోతోంది. ఒకప్పుడు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా వందలాది మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తే.. బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సదరు నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఉచిత శిక్షణను ప్రారంభించేది. రాత పరీక్ష ద్వారా నిరుద్యోగ యువతను ఎంపిక చేసి..వారికి కొంత భృతి అందించడంతోపాటు సీనియర్‌ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను ఇప్పించేది. గడిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏటా కనీసం ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఉచిత శిక్షణ తీసుకునేవారు. అంటే, టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 30 వేల మంది వరకు నిరుద్యోగ యువత పోలీస్‌, డీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2, సివిల్‌ సర్వీస్‌ వంటి పోటీ పరీక్షలకు ఈ కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. వందలాది మంది ఉద్యోగాలు పొందారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ స్టడీ సర్కిల్‌ నిర్వీర్యమైపోయిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టడీ సర్కిల్‌కు ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. అదే సమయంలో గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. దీంతో స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇప్పించే అవకాశం కూడా ఏర్పడలేదు. ఎన్నికల ఏడాది కావడంతో గ్రూప్‌-1, గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అలాగే, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ మూడు కేటగిరీల పోస్టులకు, అది కూడా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో కొందరికి శిక్షణ ఇప్పించి చేతులు దులుపుకుంది. ఐదేళ్లలో చివరి ఆరు నెలల్లో మాత్రమే ఈ స్టడీ సర్కిల్‌ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించడం గమనార్హం.

నిరుపేద విద్యార్థులకు బాసటగా ఉండాలని..

ప్రతిభ ఉన్నా ఆర్థిక స్థోమత లేక పోటీ పరీక్షలకు పేద వర్గాలకు చెందిన విద్యార్థులు దూరం అవుతున్నారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు బీసీ స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటుచేశాయి. వీటి ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి..వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేవి. ఎంపికైన అభ్యర్థులకు నిష్ణాతులైన వారితో శిక్షణ ఇచ్చేవారు. ఇందుకోసం ఫ్యాకల్టీకి భారీ మొత్తంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించేది. అదే సమయంలో విద్యార్థులకు ఆహారం, వసతి వంటి అవసరాలను కొంతైనా తీర్చుకునేందుకు తీసుకుంటున్న శిక్షణను బట్టి కొంత ఆర్థిక సాయం అందించేది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 18 , 2024 | 01:49 AM