Share News

రోడ్డెక్కిన బీసీ విద్యార్థినులు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:24 AM

తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని బీసీ కళాశాల వసతిగృహం విద్యార్థినులు గురువాం ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో సుమారు గంటకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులంతా హాస్టల్‌ నుంచి నినాదాలు చేసుకుంటూ బీసీ వెల్ఫేర్‌ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వసతిగృహంలో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, నాణ్యత ఉండడం లేదని, సిబ్బంది పనితీరు బాగోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్డెక్కిన బీసీ విద్యార్థినులు
బీసీ వెల్ఫేర్‌ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థినులు

కళాశాల హాస్టల్‌లో సమస్యలపై ఆందోళన

ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన

భోజనం, వసతులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన

సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ

గంటకుపైగా ట్రాఫిక్‌కు అంతరాయం

సీఐ, తహసీల్దారు హామీతో ఆందోళన విరమణ

ఎలమంచిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని బీసీ కళాశాల వసతిగృహం విద్యార్థినులు గురువాం ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో సుమారు గంటకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులంతా హాస్టల్‌ నుంచి నినాదాలు చేసుకుంటూ బీసీ వెల్ఫేర్‌ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వసతిగృహంలో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, నాణ్యత ఉండడం లేదని, సిబ్బంది పనితీరు బాగోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలను పలుమార్లు బీసీ వెల్ఫేర్‌ అధికారి నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని వాపోయారు. అనంతరం ప్రధాన రహదారిపై భైఠాయించారు. వంట సామగ్రిని రోడ్డుపై ఉంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వసతిగృహంలో పెడుతున్న భోజనంలో పురుగులు ఉంటున్నాయని, భోజనం నాణ్యతగా ఉండడం లేదని, కొంతమంది సిబ్బంది విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.బాలాజీ, డివిజన్‌ కార్యదర్శి మణికంఠ, అధ్యక్షుడు కేశవ్‌లు మాట్లాడుతూ, వసతిగృహంలో 100 మంది విద్యార్థినులు వున్నారని, వీరికి వాష్‌రూమ్‌లు ఐదు మాత్రమే వున్నాయని, ఇవి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. వసతిగృహంలో సమస్యలను సత్వరం పరిష్కరించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొద్దిసేపటి తరువాత సీఐ ధనుంజయరావు, తహసీల్దారు వరహాలు, ఎస్‌ఐలు అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు భవానీ, రేణు, రవి, అభి, రాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:24 AM