పింఛన్ల కోసం అడ్డదారులు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:04 AM
గ్రామాల్లో ఒకప్పుడు దివ్యాంగ పింఛను తీసుకోవాలంటే నామోషీగా ఫీలయ్యేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న వారిని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి గ్రామాల్లో నెలకొంది.

గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దివ్యాంగ పింఛ న్లు
మండలంలో ఈ ఐదేళ్లలో 300కు పైగా పెరిగిన వైనం
కూటమి ప్రభుత్వం పింఛన్ నగదు పెంచడంతో సదరం సర్టిఫికెట్ల కోసం అనర్హుల ప్రయత్నాలు
అనర్హులను ఏరివేయాలని పలువురి డిమాండ్
చోడవరం, జూలై 7: గ్రామాల్లో ఒకప్పుడు దివ్యాంగ పింఛను తీసుకోవాలంటే నామోషీగా ఫీలయ్యేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న వారిని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి గ్రామాల్లో నెలకొంది.
మండలంలోని ఓ పంచాయతీలో 28 ఏళ్ల యువకుడు పల్సర్ బైక్ స్పీడుగా నడుపుతాడు. అందరితో కలిసి చక్కగా వాలీబాల్ ఆడతాడు. చూడడానికి అతనికి ఏ వైకల్యం కనిపించదు. కానీ అతనికి శరీరంలో మెడ భాగంలో ఓ ఎముక విరిగిపోయినట్టు డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకుని దర్జాగా దివ్యాంగుల కోటాలో పింఛను పొందుతున్నాడు. మరో పంచాయతీలో ఓ పెద్ద మనిషి ఒడ్డూ పొడుగూ బాగానే ఉన్నప్పటికీ అతని చిటికెన వేలు కొద్దిగా వంకరగా ఉందని, అతనికి సదరం సర్టిఫికెట్ జారీ చేసేశారు. అతను కూడా దివ్యాంగుల కోటాలో దర్జాగా పింఛను తీసుకుంటున్నాడు. పలు గ్రామాల్లో వృద్ధులు, వితంతువుల కంటే ఈ దివ్యాంగుల పింఛన్లు ఎక్కువైపోవడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అడ్డగోలుగా అనర్హులు పింఛన్లు పొందడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిపోతున్న దివ్యాంగ పింఛన్లు
మండలంలో అన్ని కేటగిరీలు కలుపుకుని మొత్తం పింఛన్లు 13,321 ఉన్నాయి. ఇందులో వృద్ధ్దులు, వితంతువుల పింఛన్ల తరువాత స్థానంలో దివ్యాంగులే ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 7,378 ఉంటే, వితంతు పింఛన్లు 3,348 ఉన్నాయి. ఆ తరువాత దివ్యాంగ పింఛన్లు 1,535 ఉన్నాయి. చోడవరం మండలంలో ఈ ఐదేళ్లలో దివ్యాంగ పింఛన్లు ఏకంగా 300కు పైగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఇతర పింఛన్లు ఆ స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. మేజర్ పంచాయతీల కంటే చిన్న పంచాయతీల్లోనే ఎక్కువ శాతం దివ్యాంగ పింఛన్లు ఉంటున్నాయంటే ఈ అడ్డగోలు సర్టిఫికెట్ల దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని చోడవరం పంచాయతీలో 25 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ మొత్తం పింఛన్లు 1,687. ఇందులో దివ్యాంగ పింఛన్లు 328. మండలంలోని ఓ మోస్తరు పంచాయతీలైన చాకిపల్లి సచివాలయం పరిధిలో 411 పింఛన్లలో, దివ్యాంగ పింఛన్లు ఏకంగా 105కి పెరిగిపోయాయి. ఇక గవరవరం పంచాయతీలో 404 పింఛన్లకు గాను, దివ్యాంగ పింఛన్లు 86, ఖండేపల్లిలో 329 పింఛన్లలో 86, లక్కవరం పంచాయతీలో 429 పింఛన్లలో 86, వెంకన్నపాలెం పంచాయతీలో 345 పింఛన్లలో 63 పింఛన్లు దివ్యాంగుల కోటాలోనే ఉన్నాయి. 2019లో మండలంలో 1,234 దివ్యాంగ పింఛన్లు ఉంటే, 2024 సంవత్సరానికి వచ్చేసరికి ఆ సంఖ్య 1,535కి పెరిగిపోయింది. ఇందులో కనీసం 50 శాతానికి పైగా బోగస్ పింఛన్లు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగ పింఛన్ నగదు రూ.6 వేలు చేయడంతో మరికొందరు అర్హత లేకున్నా సదరం సర్టిఫికెట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం మండలంలో పింఛన్ల పంపిణీకి రూ.5.6 కోట్లు ఖర్చు అవుతోంది. ఇటువంటి పరిస్థితిలో మరికొందరు అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు పొంది దివ్యాంగ పింఛన్లు తీసుకుంటే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ఇప్పటి వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను ప్రత్యేక వైద్య బృందంతో తనిఖీ చేయిస్తే బండారం బయటపడుతుందని స్థానిక నాయకులు అంటున్నారు. దివ్యాంగ పింఛన్లలో వడపోత చేపట్టి అర్హులకు మేలు జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.