బాబోయ్ భోగాపురం
ABN , Publish Date - Jul 20 , 2024 | 12:39 AM
మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భోగాపురంలో చాలా మంది మూత్ర పిండాలు, కీళ్ల నొప్పుల వ్యాధులతో బాధపడుతున్నారు. గత ఏడేళ్లలో ఈ గ్రామంలో ఈ వ్యాధులతో 15 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మరో పది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు.
- కిడ్నీ, కీళ్ల సంబంధిత వ్యాధుల బారిన జనం
- ఏడేళ్లలో 15 మంది మృత్యువాత
- ప్రస్తుతం మరో పది మంది బాధితులు
- కొళాయి నీటి వల్లేనంటున్న గ్రామస్థులు
- బోరు తవ్వించేందుకు ప్రయత్నిస్తే వైసీపీ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన
అచ్యుతాపురం, జూలై 19: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భోగాపురంలో చాలా మంది మూత్ర పిండాలు, కీళ్ల నొప్పుల వ్యాధులతో బాధపడుతున్నారు. గత ఏడేళ్లలో ఈ గ్రామంలో ఈ వ్యాధులతో 15 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మరో పది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు.
పంచాయతీ కొళాయిల ద్వారా సరఫరా చేసే నీళ్లను తాగడం వల్లే ఈ వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. గత్యంతరం లేక ఈ నీళ్లను తాగుతున్నామని వాపోతున్నారు. గ్రామంలోని యువకులు రూ.2 లక్షలు చందాలు పోగు చేసి బోరు తవ్వించాలని ప్రయత్నిస్తే కొందరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారని చెబుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులకు భయపడి కొందరు సొంత ఇళ్లను వదులుకొని అచ్యుతాపురంలో అద్దె ఇళ్లల్లో ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో కూండ్రపు నాగేశ్వరరావు, కూండ్రపు శ్రీనివాసరావు, కూండ్రపు సన్నిబాబు, పైల బాబూరావు, కె. సత్యనారాయణ ఈ వ్యాధులతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి నమూనాలను పరీక్షించాలని, వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.