Share News

పచ్చనిచెట్లపై గొడ్డలివేటు

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:21 AM

ఏజెన్సీలో పచ్చని చెట్లు అక్రమార్కుల గొడ్డలకు బలైపోతున్నాయి. ఏళ్లుగా ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి పెంచుతున్న భారీ వృక్షాలను కూకటివేళ్లతో సహా పెకిలిస్తున్న అక్రమార్కులు వాటిని కలపగా మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రమైన హుకుంపేట మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ, ఫారెస్టు సోయల్‌ డిపార్ట్‌మెంట్‌ నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా మారాయి. వీటిపై అక్రమార్కుల కన్ను పడింది.

పచ్చనిచెట్లపై గొడ్డలివేటు
హుకుంపేటలో ప్రభుత్వ చెట్లను నరికివేసి, విక్రయానికి సిద్ధం చేసిన కలప

ఏజెన్సీలో ఇష్టారాజ్యంగా వృక్షాల నరికివేత

హుకుంపేటలో ప్రభుత్వ చెట్లు తొలగింపు

అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన వైనం

పట్టించుకోని పారెస్టు ఆర్‌ఎంపీ ఆధికారులు

హుకుంపేట, జూన్‌ 7:

ఏజెన్సీలో పచ్చని చెట్లు అక్రమార్కుల గొడ్డలకు బలైపోతున్నాయి. ఏళ్లుగా ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి పెంచుతున్న భారీ వృక్షాలను కూకటివేళ్లతో సహా పెకిలిస్తున్న అక్రమార్కులు వాటిని కలపగా మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రమైన హుకుంపేట మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ, ఫారెస్టు సోయల్‌ డిపార్ట్‌మెంట్‌ నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా మారాయి. వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో ఇటీవల ఈ చెట్లను వ్యాపారులు అక్రమంగా తొలగించి, కలపను యథేచ్ఛగా తరలిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ బాలికల వసతిగృహం సమీపంలోని భారీ చెట్లను, గిరిజన సహకార సంస్ద సమీపంలోని యూకలిప్టస్‌ చెట్ల కొమ్మలు నరికివేసి కలపను సిద్ధం చేశారు. ఆ తరువాత యంత్రాలతో వాటిని ముక్కలుగా చేసి, విక్రయానికి సిద్ధం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. చెట్ల తొలగింపుతో పచ్చదనం కనుమరుగవుతోందని, ఏజెన్సీలోనూ వేడి వాతావరణం నెలకొంటోందని వాపోతున్నారు. భారీ వృక్షాలను పరిరక్షించాల్సిన అటవీ శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల అక్రమార్కులు చెట్లను ఇష్టానుసారం నరికి, అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. పంచాయతీ, రెవెన్యూ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెట్లను అక్రమంగా నరికి సొమ్ముచేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కలపను రాత్రి సమయంలో తరలిస్తున్నారని, యంత్రాంగం గట్టి నిఘాను ఏర్పాటుచేస్తే అక్రమాలు బయటపడతాయని చెబుతున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 01:21 AM