Share News

ప్రజలకు అందుబాటులో ఉంటా

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:19 AM

న్యాయం కోసం వచ్చే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌గున్ని అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటా

స్టేషన్‌ స్థాయిలోనే న్యాయం జరిగేలా చూస్తా

మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి

గంజాయి సాగు, రవాణాను నియంత్రిస్తాం

రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

న్యాయం కోసం వచ్చే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌గున్ని అన్నారు. డీఐజీగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తరువాత విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌ స్థాయిలోనే ప్రజలకు న్యాయం జరిగేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఆ విధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానన్నారు. రేంజ్‌ పరిధిలో ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అన్ని విభాగాలను పటిష్ట పరిచేందుకు కృషిచేస్తానన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని, ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం లేకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకువెళతామని చెప్పారు. సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో కథనాలు ప్రచురించే ముందు వివరణ తీసుకోవాలని మీడియాను కోరారు. సోషల్‌ మీడియాలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి కథనాలు పోస్టు చేయడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. అందువల్ల ఒకటికి, రెండుసార్లు నిర్ధారణ చేసుకోవాలని విశాల్‌గున్ని అన్నారు. కాగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు.

Updated Date - Feb 13 , 2024 | 01:19 AM