Share News

నాడు నియోజకవర్గ కేంద్రంగా రేవిడి

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:04 AM

ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి సార్వత్రిక ఎన్నికలలో పద్మనాభం మండలం రేవిడి గ్రామం శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉండేది.

నాడు నియోజకవర్గ కేంద్రంగా రేవిడి

1955 ఎన్నికల్లో పద్మనాభరాజు, 1962లో కోళ్ల అప్పలనాయుడు గెలుపు

ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి సార్వత్రిక ఎన్నికలలో పద్మనాభం మండలం రేవిడి గ్రామం శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. అప్పటికే ఈ గ్రామం బ్రిటీషు ప్రభుత్వ ఏలుబడిలో భూముల శిస్తు వసూళ్లను, ఇతర కార్యకలాపాలను చూసే ఫిర్కా (రెవెన్యూ బ్లాక్‌)గా ఉండేది. దీంతో పాటు ఈ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరాజు వెంకటపతిరాజు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం భూస్వాముల నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో రేవిడికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అలాగే భారత ఎన్నికల సంఘం ఎనిమిదో రఽపధాన ఎన్నికల కమిషనర్‌ (1986-90)గా పనిచేసిన ఆర్‌వీఎస్‌ పేరిశాస్త్రి కూడా ఈ గ్రామానికి చెందినవారే. ఈ నేపథ్యంలో తొలి (1955), మలి (1962) సార్వత్రిక ఎన్నికల వరకు రేవిడి నియోజకవర్గ కేంద్రంగా కొనసాగింది. 1955లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాకర్లపూడి విజయరాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు (కేవీఆర్‌ఎస్‌ పద్మనాభరాజు) ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి, 1962లో కోళ్ల అప్పలనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1955 ఫిబ్రవరి 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన కేవీఆర్‌ఎస్‌ పద్మనాభరాజు సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్ధి గుజ్జు రామునాయుడుకు 11,891 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పద్మనాభరాజుకు 15,217 ఓట్లు రాగా, రామునాయుడుకు 3,326, భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన మజ్జి ఆదినారాయణకు 2,945 ఓట్లు, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చెల్లూరి చిట్టిబాబుకు 2,855 ఓట్లు లభించాయి. ఇక 1962 ఫిబ్రవరి 19న జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోళ్ల అప్పలనాయుడు తన సమీప ప్రత్యర్థి సుంకర సత్యనారాయణపై 5,339 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పలనాయుడుకు 14,823 ఓట్లు రాగా, జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థి సుంకర సత్యనారాయణకు 9,484, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చెల్లూరి రామారావునాయుడుకు 8,008 ఓట్లు లభించాయి. 1967 సార్వత్రిక ఎన్నికల నాటికి రేవిడి నియోజకవర్గం భీమిలి శాసనసభ నియోజకవర్గంలో విలీనం కావడంతో ఈ గ్రామం పూర్వ నియోజకవర్గ కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయింది.

-పద్మనాభం

Updated Date - Apr 18 , 2024 | 02:04 AM