Share News

ఏయూ ప్రక్షాళన?

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:23 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలు వ్యవహారాలకు, అవినీతి కార్యకలాపాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచింది.

ఏయూ ప్రక్షాళన?

మానవ వనరుల శాఖా మంత్రి లోకేశ్‌ ప్రత్యేక దృష్టి

ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చిన పాలకులు

అస్మదీయులకు అడ్డగోలుగా పదవులు...గిట్టని వారిపై కక్షసాధింపులు

ఎన్నికలకు ముందు పల్లా సతీమణిపైనా వేధింపులు

రూ.కోట్లలో స్వాహా, దాతలు ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలు వ్యవహారాలకు, అవినీతి కార్యకలాపాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచింది. వీసీగా పీవీజీడీ ప్రసాదరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజకీయ కేంద్ర బిందువుగా మారి, అనధికారిక వైసీపీ కార్యాలయంగా మారిపోయింది. ఈ వ్యవహారాలపై ప్రతిపక్షంలో ఉండగా ఘాటుగా స్పందించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రస్తుతం మానవ వనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో ఏయూ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేశారని సమాచారం. ఎంతో చరిత్ర ఉన్న వర్సిటీని తిరిగి ఉన్నత స్థానంలో నిలిపేందుకు వీలుగా త్వరలోనే చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశంలోనే పేరెన్నికగన్న యూనిర్సిటీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి స్థానం ఉంది. గతంలో వీసీలుగా పనిచేసిన వారంతా ఈ ప్రతిష్ఠకు ఏమాత్రం భంగం కలగకుండా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇన్‌చార్జి వీసీగా పీవీజీడీ ప్రసాదరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వర్సిటీ ఖ్యాతి దిగజారింది. రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. వీసీ వైసీపీ కార్యకర్తగా మారిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలు నిర్ణయాలు, నియామకాలకు వర్సిటీని కేంద్రాంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

రిజిస్ట్రార్‌తో ప్రారంభం

నిబంధనలకు విరుద్ధగా ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌ను మూడు పర్యాయాలు రిజిస్ర్టార్‌గా నియమించడం దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. తన పలుకుబడిని ఉపయోగించి పదవీ విరమణ చేసిన తరువాత కూడా అనేకసార్లు రిజిస్ర్టార్‌గా పొడిగింపు ఉత్తర్వులను తీసుకువచ్చారు. అంతేకాకుండా సుమారు వందమందికిపైగా అస్మదీయులకు వర్సిటీలోని అనేక విభాగాల్లో అడ్జెంక్ట్‌ ప్రొఫెసర్లు, చైర్‌ ప్రొఫెసర్లుగా అవకాశాలను కల్పించారు. గత మూడేళ్లుగా రిటైర్‌ అయిన ఎంతోమంది ప్రొఫెసర్లను కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇప్పటికీ వీరు కీలక విభాగాధిపతులుగా, డీన్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనూ ఎయిడెడ్‌ ఫ్యాకల్టీని వర్సిటీలో నియమించరు. కానీ వారికి పోస్టింగులు ఇవ్వడంతో పాటు కీలక విభాగాలను కేటాయించారు. కొందరికి నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌వోడీలుగానూ అవకాశం కల్పించారు. అదే సమయంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న చాలామంది గెస్ట్‌ ఫ్యాకల్టీని బయటకు పంపించేశారు. వారు రోజుల తరబడి దీక్షలు చేసినా కనీసం పట్టించుకోలేదు. ఏయూ ప్రాంగణంలో నిరసన తెలిపేందుకు కూడా అవకాశం కల్పించలేదు.

పీహెచ్‌డీల్లోనూ గోల్‌మాల్‌

ఏయూలోని పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా వీసీ వ్యాపారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏయూ పాలకులు లక్షలాది రూపాయలు తీసుకుని పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారని స్వయంగా వర్సిటీలో పనిచేసే ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ మీడియా ముఖంగా ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా వర్సిటీలో ఎంతోమంది సీనియర్‌ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ, వారిని కాదని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తికి రిజిస్ర్టార్‌ బాధ్యతలను అప్పగించడం కలకలం రేపింది. ఈ నిర్ణయాన్ని ఎంతోమంది అధికారులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా ప్రసాదరెడ్డి వెనక్కి తగ్గలేదు.

పచ్చని చెట్లపై వేటు

వర్సిటీ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మంటగలిపే మరో చర్యకు వీసీ ప్రసాదరెడ్డి పాల్పడ్డారు. వందలాది ఎకరాల్లో ఉన్న వేలాది వృక్షాలు, చెట్లను తొలగించేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే వంకతో పచ్చదనంపై వేటువేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ పనులు సాగుతుండడం గమనార్హం. అంతేకాదు ఓ ప్రైవేటు వ్యక్తికి ఈ స్థలాన్ని కట్టబెట్టేందుకు యత్నించారని, అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని వర్సిటీలోని అధికారులే చెబుతున్నారు.

గిట్టని వారిపై వేధింపులు

అస్మదీయులకు అడ్డగోలుగా పదవులు కట్టబెట్టడం, గిట్టనివారిపై వేధింపులకు దిగడం లాంటి చర్యలు వీసీ ప్రసాదరెడ్డికి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదనే విమర్శలున్నాయి. గత ఐదేళ్లలో ఎంతోమంది అనుయాయులకు వర్సిటీలో కీలక పదవులు కట్టబెట్టిన వీసీ నచ్చని వారి పట్ల అంతే కర్కశంగా వ్యవహరించారు. గెస్ట్‌ ఫ్యాకల్టీని విధులు నుంచి తొలగించడం, పలు కోర్సులను ఎత్తివేయడం ద్వారా ఇబ్బందులకు గురిచేయడం, ప్రతిభ, అనుభవం ఉన్నా...పదవులు రాకుండా చేసి అణచివేశారు. తాజాగా ఎన్నికలకు ముందు కూడా ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీమణిని కూడా వేధింపులకు గురిచేశారు. ఎన్నికల ప్రచారం చేశారంటూ ఆమెను సస్పెండ్‌ చేశారు. దీంతో పాటు వర్సిటీలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని, రూసా నిధులు, దాతలు ఇచ్చిన నిధులకు ఎలాంటి లెక్కలు లేకుండా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

విచారణ చేస్తే వెలుగులోకి..

ఏయూను తమ జాగీరుగా భావించిన వర్సిటీ ఉన్నతాధికారులు ఐదేళ్లలో అనేక అడ్డగోలు కార్యకలాపాలకు పాల్పడ్డారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. ఏయూ ప్రక్షాళనకు తొలి ప్రాధాన్యమిస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారని, ఈ దిశగా సమీక్ష నిర్వహించి, ఇక్కడి అడ్డగోలు వ్యవహారాలపై విచారణకు ఆదేశిస్తారని, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని సమాచారం.

వర్సిటీలో అరాచకం

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ర్టార్‌ పీహెచ్‌డీ ప్రవేశం

2022లో ఎగ్జిక్యూటివ్‌ కోటాలో ప్రవేశాన్ని పొందిన ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టీఫెన్‌

రూ.50 కోట్లు టర్నోవర్‌ ఉన్న సంస్థలకు మాత్రమే ఎగ్జిక్యూటివ్‌ కోటాకు అవకాశం

పీహెచ్‌డీ ప్రవేశం పొందే సమయానికి ఏయూలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా స్టీఫెన్‌

అది మరో ఉల్లంఘన

విశాఖపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందారు. ఆయన 2022లో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగంలో పీహెచ్‌డీలో చేరారు. కొద్దిరోజుల కిందట ప్రీ పీహెచ్‌డీ పరీక్షల కోసం దరఖాస్తు చేసినప్పుడు...విభాగాధిపతి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎగ్జిక్యూటివ్‌ కోటాలో పీహెచ్‌డీ పట్టా పొందాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ సంస్థ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్‌ పీహెచ్‌డీ ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ సంస్థ టర్నోవర్‌ కనీసం రూ.50 కోట్లు ఉండాలి. పీహెచ్‌డీ ప్రవేశం పొందే సమయానికి స్టీఫెన్‌ నగర పరిధిలోని ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆ సంస్థ టర్నోవర్‌ ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ ఎగ్జిక్యూటివ్‌ కోటాలో ఆయనకు పీహెచ్‌డీ ప్రవేశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ ప్రవేశం పొందే సమయానికే స్టీఫెన్‌ ఏయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. వర్సిటీలోని కీలక పదవిలో ఉంటుండగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందకూడదు. కానీ, ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి మరీ ఆయన ప్రవేశాన్ని పొందారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉన్నతాధికారి అండదండలతోనే పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందినట్టు చెబుతున్నారు. ఇదిలావుండగా స్టీఫెన్‌ పీహెచ్‌డీ ప్రవేశం ప్రస్తుతం హెచ్‌వోడీగా ఉన్న ప్రొఫెసర్‌కు తెలియకుండా జరగడం గమనార్హం. ప్రీ పీహెచ్‌డీ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తును కూడా హెచ్‌వోడీకి తెలియకుండానే ముందుకు పంపించాల్సిందిగా రిజిస్ర్టార్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.

నిబంధనలు ఉల్లంఘనే..

వర్సిటీలోకి ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ వచ్చిన దగ్గర నుంచి అనేక ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు స్టీఫెన్‌ ప్రవేశమే నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఆయన అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌గా నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో చేరారు. ఆ తరువాత ఎంతో మందిని సీనియర్లను పక్కనపెట్టి మరీ ట్రాన్స్‌ డిసిప్లినరీ హబ్‌కు డీన్‌గా వర్సిటీ ఉన్నతాధికారులు నియమించారు. ఇదే టీడీఆర్‌ హబ్‌ నుంచి వందలాది మందికి అడ్డగోలుగా ప్రవేశాలు కల్పించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ తరువాత వర్సిటీలోని ఎంతోమంది రెగ్యులర్‌ ప్రొఫెసర్ల సీనియారిటీని పక్కనపెట్టి మరీ ఆయనకు ఉన్నతాధికారులు రిజిస్ర్టార్‌గా బాధ్యతలను అప్పగించారు. ఇది వర్సిటీ చరిత్రలోనే మరో అడ్డగోలు నిర్ణయంగా అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - Jun 18 , 2024 | 01:23 AM