Share News

ఏయూకు రాజకీయ చెద!

ABN , Publish Date - May 12 , 2024 | 01:10 AM

పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైసీపీ పాలనలో రాజకీయ చెద పట్టింది.

ఏయూకు రాజకీయ చెద!

  • ఐదేళ్లలో వర్సిటీ ఖ్యాతిని మంట గలిపిన వైసీపీ ప్రభుత్వం

  • అడ్డగోలు నియామకాలు...అస్మదీయులకు పదవులు

  • తప్పుడు నిర్ణయాలతో ఏయూ పరువును భ్రష్ఠుపట్టించిన పాలకులు

  • వర్సిటీ కేంద్రంగా అధికార పార్టీ కార్యకలాపాలు

  • వీసీ ఛాంబర్‌లోనే వైసీపీ ప్రముఖుల జన్మదినోత్సవాలు

  • అధికార పార్టీ సేవలో తరించిన ఇతర అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైసీపీ పాలనలో రాజకీయ చెద పట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు వర్సిటీ ఖ్యాతిని మంటగలిపాయి. ముఖ్యంగా వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఏయూలో జగన్‌, విజయసాయిరెడ్డి తదితరుల పుట్టినరోజు కార్యక్రమాల నిర్వహణతో వర్సిటీ రాజకీయ కేంద్రంగా మారిపోయిందనే విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీసీకి శుభాకాంక్షలు తెలిపేందుకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పోటీ పడ్డారు. ఈ తతంగం సుమారు మూడు నెలలు కొనసాగింది. నిత్యం వచ్చి, పోయే వైసీపీ నాయకులతో వర్సిటీ వైసీపీ కార్యాలయాన్ని తలపించేది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా వీసీ కనీసం పట్టించుకోలేదు. ఆ తరువాత కూడా వైసీపీ నేతల రాకపోకలు కొనసాగాయి. దీంతో వీసీ చాంబర్‌ అధికార పార్టీ కార్యాలయంగా మారిందన్న విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే వీసీ ప్రవర్తన కొనసాగింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన వైఎస్‌ విజయలక్ష్మి, సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను వీసీ ఛాంబర్‌లో నిర్వహించేవారు. వర్సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. డీజే సౌండ్స్‌, బాణసంచా మోతలతో హోరెత్తించారు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదని సీనియర్‌ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

విద్యార్థులకు దూరంగా వీసీ

సాధారణంగా వీసీ విద్యార్థులకు అందుబాటులో ఉండి, వారి యోగక్షేమాలపై దృష్టి సారించాలి. సమస్యలను వివరించేందుకు అవకాశమివ్వాలి. వాటిని సత్వరం పరిష్కరించాలి. కానీ ప్రసాదరెడ్డి ఈ తరహా వ్యవహారాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. విద్యార్థులు వీసీనీ కలిసే అవకాశమే లేకుండా తన కార్యాలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయించారు. సెక్యూరిటీ అనుమతి లేకుండా ఎవరూ లోనికి వెళ్లలేని స్థితి కల్పించారు. అంతేకాదు సమస్యలపై గత ఐదేళ్లలో విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టే సాహసం కూడా చేయకుండా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

అడ్డగోలు నియామకాలకు అడ్డా...

గడిచిన ఐదేళ్లలో విశ్వవిద్యాలయంలో అనేక అడ్డగోలు నియామకాలు జరిగాయి. అస్మదీయులైన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. గతంలో రిజిస్ర్టార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌కు నిబంధనలకు విరుద్ధంగా మూడుసార్లు పొడిగింపు ఇచ్చారు. తాజాగా ఆ పదవిని నిబంధనలకు విరుద్ధంగా మరొకరికి కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నియామకంపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అలాగే విశ్రాంత అధికారులకు కూడా వీసీ అడ్డగోలుగా పదవులు కట్టబెట్టారు. అనేక మంది మాజీలను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టారు. అనుయాయులను గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా, అడ్జెంక్ట్‌ ప్రొఫెసర్లుగా నియమించారు. వర్సిటీలో వీరి సంఖ్య 30 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక పీహెచ్‌డీ పట్టాల ప్రదానంపై ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ మీడియా ముఖంగా విమర్శలు చేయడం గమనార్హం.

అసాంఘిక ముద్ర..

వర్సిటీలోని నార్త్‌ క్యాంపస్‌ పరిధిలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో చిట్టడవిని తలపించేలా వేలాది వృక్షాలు ఉండేవి. వాటిని నిబంధనలకు విరుద్ధంగా, అటవీ శాఖ అనుమతి లేకుండా తొలగించారని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ ప్రాంతంలో చెరువులు, ఇంకుడు గుంతలను కప్పేశారని కూడా విమర్శలున్నాయి. దీంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వందలాదిగా కుప్పపోసిన కండోమ్‌ ప్యాకెట్ల ఫొటోలు, వీడియోలను ఏయూ అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఈ వ్యవహారం వర్సిటీ ప్రతిష్ఠను మరింతగా మంటగలిపింది.

కలకలం రేపిన గంజాయి

వర్సిటీ విద్యార్థుల వద్ద గంజాయి లభించడం, సెక్యూరిటీ సిబ్బందే గంజాయి విక్రయిదారులుగా వ్యవహరించడం కలకలం రేపాయి. రెండేళ్ల కిందట గంజాయి వ్యవహారంలో విద్యార్థులు కొట్లాటకు దిగి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తాజాగా మరికొందరు గంజాయితో దొరికారు. ఇవన్నీ వర్సిటీ సెక్యూరిటీ పనితీరును ప్రశ్నిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం వీటిపై కఠినంగా ఉన్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి.

వైఎస్‌ విగ్రహం ఏర్పాటు

గతంలో ఏయూ క్యాంపస్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఏడాది కిందట పాత విగ్రహాన్ని తొలగించి మరో భారీ విగ్రహాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. విద్యా రంగ అభివృద్ధి కృషిచేసిన వారి విగ్రహాలను నెలకొల్పాల్సిన చోట...రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడమేమిటన్న ప్రశ్నలు వర్సిటీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ సేవలో వీసీ

వైస్‌ చాన్సలర్‌గా ప్రసాదరెడ్డి అధికార పార్టీకి తన పరిధికి మించి మేలు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలపై విద్యార్థులతోనే సర్వే చేయించి అధికార పార్టీ పెద్దలకు అందించారు. ఆ ఎన్నికల్లో కొంతమందికి టికెట్లు ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఓ వార్డు కార్పొరేటర్‌కు అనుకూలంగా వీసీ ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించేందుకు ఏయూ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఓ హోటల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో వీసీ వెనుక నుంచి వెళ్లిపోయారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేందుకు వీసీ తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఐదేళ్లలో వైస్‌ చాన్సలర్‌గా రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ప్రసాదరెడ్డి... వైసీపీ నాయకుని మాదిరిగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 12 , 2024 | 01:10 AM