Share News

ఎన్నికల వేళ... యూజర్‌చార్జీలకు బ్రేక్‌

ABN , Publish Date - May 20 , 2024 | 12:42 AM

ముక్కుపిండి మరీ వసూలు చేసిన జీవీఎంసీ అధికారులు... రెండు నెలలుగా ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశమవుతోంది.

ఎన్నికల వేళ... యూజర్‌చార్జీలకు బ్రేక్‌

గత ఆరు నెలల్లో యూజర్‌ చార్జీలు వసూళ్లు

నెల వసూలైన మొత్తం శాతం

నవంబరు 1,88,35,711 32.3

డిసెంబరు 1,29,69,030 22.26

జనవరి 55,31,160 9.48

ఫిబ్రవరి 84,33,040 14.44

మార్చి 34,94,600 6.0

ఏప్రిల్‌ 17,47,300 2.99

------------------------------------------

  • వసూలును నిలిపివేసిన జీవీఎంసీ

  • గత ఏడాది నవంబరులో 32 శాతానికిపైగా వసూలు

  • మార్చిలో ఆరు శాతం.. ఏప్రిల్‌లో 2.99 శాతం మాత్రమే

  • వైసీపీ ఓట్లకు గండిపడకూడదనే నిర్ణయం?

  • అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

  • ఎన్నికల విధుల్లో బిజీయే కారణమన్న యంత్రాంగం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘మాపై యూజర్‌ చార్జీల భారం మోపొద్దు బాబోయ్‌.. భారం మోయలేమని’ నగరవాసులు నెత్తినోరూ మొత్తుకున్నా ససేమిరా అని ముక్కుపిండి మరీ వసూలు చేసిన జీవీఎంసీ అధికారులు... రెండు నెలలుగా ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశమవుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల్లో వైసీపీ ఓట్లకు గండి పడకూడదనే భావంతోనే అధికారులు యూజర్‌ చార్జీల వసూలును నిలిపివేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో చెత్తసేకరణ, వాటి నిర్వహణ శాస్ర్తీయంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలను ఆదేశించింది. జీవీఎంసీ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించడంతోపాటు, దుకాణాలు, హోటళ్లు, పార్లర్లు వంటి వాణిజ్యపరమైన ప్రదేశాలకు వద్దకు వెళ్లి చెత్తసేకరించేందుకు ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ (క్లాప్‌) పేరుతో 640 వాహనాలను జీవీఎంసీకి కేటాయించింది. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చులను ప్రజల నుంచి యూజర్‌ చార్జీల రూపేణా వసూలుచేసుకునే వెసులుబాటును కూడా జీవీఎంసీకి కల్పించింది.

రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు జీవీఎంసీ అధికారులు 2021 జూన్‌లో యూజర్‌ చార్జీల వసూలు చేసేందుకు వీలుగా కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. నివాసితుల నుంచి నెలకు రూ.120 చొప్పున, మురికివాడల్లో మాత్రం రూ.60 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. హోటళ్లు, రెస్టారెంట్‌లు, పార్లర్లు వంటి వాణిజ్యపరమైన అసెస్‌మెంట్‌లకు మాత్రం వాటిస్థాయిని బట్టి యూజర్‌ చార్జీలను నిర్ణయించారు. దీనిప్రకారం జీవీఎంసీ పరిధిలో 6,04,264 అసెస్‌మెంట్ల నుంచి నెలకు రూ.5.8కోట్లు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 2021 నవంబరు నుంచి యూజర్‌ చార్జీల వసూలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో అధికారులు మొదట్లో ఆచితూచి వ్యవహరించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో జీవీఎంసీ అధికారులు స్పెషల్‌డ్రైవ్‌ మాదిరిగా యూజర్‌ చార్జీల వసూలు బాధ్యతలను తీసుకున్నారు. వార్డు సచివాలయం ఉద్యోగులతోపాటు వార్డు వలంటీర్లను భాగస్వాములను చేసి యూజర్‌ చార్జీల వసూళ్లకు టార్గెట్‌లు విధించారు. అయినప్పటికీ ప్రజల నుంచి తిరుగుబాటు కొనసాగడంతో సంక్షేమ పథకాలు అందుకునే లబ్ధిదారులకు యూజర్‌ చార్జాలను ముడిపెట్టి పథకాలను నిలిపేస్తామని బెదిరింపులకు కూడా దిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది యూజర్‌ చార్జీలను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎన్నికల వేళ... ఆచి తూచి...

నగరంలో యూజర్‌ చార్జీలు వసూలు ప్రారంభించిన మొదటి నెల (2021 నవంబరు)లో 1.48 శాతంతో మొదలవగా, గత ఏడాది మే నాటికి దాదాపు 50 శాతానికి చేరింది. ఆ తర్వాత 2024 సాధారణ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో యూజర్‌ చార్జీల వసూలు విషయంలో అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో వసూలుశాతం తగ్గుతూ వచ్చింది. గత ఏడాది నవంబరు నాటికి 32 శాతం వసూలు కాగా, డిసెంబరుకు 22.26 శాతానికి, జనవరి నాటికి 9.48 శాతానికి, ఫిబ్రవరినాటికి 14.44శాతానికి, మార్చి నాటికి ఆరు శాతానికి, ఏప్రిల్‌నాటికి 2.99శాతానికి పడిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అధికార పార్టీకి మేలు చేయాలనే...

యూజర్‌ చార్జీల వసూలులో ప్రభుత్వంపై ఆదినుంచీ నగర వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఎన్నికల్లో వైసీపీ ఓట్లకు గండిపడుతుందని నాయకులు గుర్తించారు. దీంతో ఎన్నికల హడావుడి ప్రారంభమయినప్పటి నుంచే యూజర్‌ చార్జీల వసూలుపై ఉదాశీనంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పటివరకూ లక్ష్యం మేరకు యూజర్‌ చార్జీలను వసూలు చేయని వార్డు సచివాలయం ఉద్యోగులపై సస్పెన్షన్లు, చార్చిమెమోలు జారీచేయడం వంటి తీవ్రమైన చర్యలు తీసుకున్న అధికారులు ఒక్కసారిగా ఆ విషయాన్ని విస్మరించడం దీనికి బలాన్ని చేకూర్చింది. యూజర్‌ చార్జీలు చెల్లించాలని ఒకవైపు సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్తే... అదే సమయంలో గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో వెళ్లిన వైసీపీ నేతలు, అధికారులు తిరుగుబాటు ఎదుర్కొనాల్సి ఉంటుందని గ్రహించే, వైసీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఓట్లకు గండిపడకుండా ఉండేలా అధికారులు కూడా తమ వంతు సహకారం అందించి, స్వామి భక్తిచాటుకున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 20 , 2024 | 12:42 AM