Share News

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 23 , 2024 | 01:12 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, జేసీ జాహ్నవి, తదితరులు (ఫైల్‌)

- ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా గదులు

- ఓట్ల లెక్కింపు విధులకు 1500 మంది ఉద్యోగులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికలు ముగిసిన తరువాత అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను అనకాపల్లిలో కలెక్టరేట్‌కు సమీపంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన విషయం తెలిసిందే. స్ట్రాంగ్‌ రూమ్‌కు సమీపంలోనే వచ్చే నెల 4న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించనున్న ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి పార్లమెంట్‌కు సంబంధించి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఇక్కడ లెక్కించనున్నారు. దీని కోసం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరు గదులు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ఒక గది, పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్ల లెక్కింపునకు ఆరు గదులు.. మొత్తం 13 గదులను ఓట్ల లెక్కింపునకు అనువుగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధం చేశారు. అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లు విశాఖపట్నంలో లెక్కించనున్నారు.

ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానుండగా తొలుత పోస్టల్‌, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి టేబుల్‌ వద్ద ఒక ఆర్‌వో, ఏఆర్‌వో పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుపుతారు. జిల్లాలో అధికారుల గణాంకాల ప్రకారం హోం ఓటర్లు 1,082 మంది, ఎన్నికల విధుల్లో పాల్గొన్న 12,864 మంది, అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 1,468 మంది, త్రివిధ దళాలకు చెందిన సర్వీసు ఓటర్లు 1,051 మంది, ఇతర జిల్లాల నుంచి అందిన పోస్టల్‌ బ్యాలెట్‌లు 2,909 మంది కలిపి మొత్తం 19,374 ఓట్లను 14 టేబుళ్లపై లెక్కించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన అర్ధగంట తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఓట్ల లెక్కింపునకు 1500 మంది..

ఓట్ల లెక్కింపు విధుల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 1500 మంది ఉద్యోగులు పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గానికి 200 మంది చొప్పున విధుల్లో పాల్గొంటారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గదిలో ఒక రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్షణలో ఒక ఏఆర్‌వో, గెజిటెడ్‌ హోదా కలిగిన ఒక కౌంటింగ్‌ సూపరింటెండెంట్‌, ఒక సహాయకుడు, ఒక మైక్రో అబ్జర్వర్‌, ఈవీఎంలను అందజేసేందుకు ఇద్దరు వీఆర్‌వోలను నియమించారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌ ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలో ఉంటారు. ఉద్యోగులకు ఓట్ల లెక్కింపుపై మాక్‌డ్రిల్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాట్లు

ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గదిలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రౌండ్‌కు కనీసం అర్ధగంట సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి రౌండ్‌లో ఆయా నియోజకవర్గానికి చెందిన 14 పోలింగ్‌ బూత్‌ల ఓట్ల లెక్కింపు జరపనున్నారు. చోడవరం నియోజకవర్గం పరిధిలో 243 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 17 రౌండ్లు పూర్తి లెక్కింపు, 18వ రౌండ్‌లో 5 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఓట్లు లెక్కించనున్నారు. మాడుగుల నియోజకవర్గం పరిధిలో మొత్తం 235 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే 14 టేబుళ్లపై 16 రౌండ్లు పూర్తిస్థాయిలో, 17వ రౌండ్‌లో 11 బూత్‌లకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అనకాపల్లి పరిఽధిలో 251 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 17 రౌండ్లు పూర్తిగా 14 టేబుళ్లపై లెక్కింపు జరిపి 18వ రౌండ్‌లో 13 పోలింగ్‌ కేంద్రాలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఎలమంచిలి పరిధిలో 246 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను 17 రౌండ్లలో పూర్తిస్థాయిలో లెక్కింపు, 18వ రౌండ్‌లో 8 బూత్‌లకు సంబంధించిన ఓట్లు లెక్కించనున్నారు. పాయకరావుపేట పరిధిలోని 292 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను 20 పూర్తిస్థాయి రౌండ్లలో లెక్కించి, 21వ రౌండ్‌లో 12 బూత్‌ల ఓట్లు లెక్కించనున్నారు. అదేవిధంగా నర్సీపట్నం పరిధిలో 262 పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఓట్లు 14 టేబుల్స్‌పై 18 పూర్తిస్థాయి రౌండ్లు లెక్కించి 19వ రౌండ్‌లో 10 పోలింగ్‌ బూత్‌ల ఓట్లు లెక్కిస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఆరు వేర్వేరు గదులను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

Updated Date - May 23 , 2024 | 01:12 AM