Share News

సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ప్రధాని మోదీ సభకు చురుగ్గా ఏర్పాట్లు

ABN , Publish Date - May 06 , 2024 | 01:12 AM

జిల్లాలోని తాళ్లపాలెంలో జాతీయ రహదారికి సమీపంలో గల లేఅవుట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ఈ ఎన్నికల ప్రచార సభలో మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారు.

సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు  ప్రధాని మోదీ సభకు చురుగ్గా ఏర్పాట్లు

- నేడు తాళ్లపాలెంలో బహిరంగ సభ

- హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు

అనకాపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తాళ్లపాలెంలో జాతీయ రహదారికి సమీపంలో గల లేఅవుట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, కూటమి అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ఈ ఎన్నికల ప్రచార సభలో మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారు.

తాళ్లపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో జిల్లాలో కూటమి నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. తాళ్లపాలెంలో సభా ప్రాంగణం జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు రోడ్డును పూర్తిగా వాహన రాకపోకలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచార సభకు హాజరై ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 4.50 గంటలకు తాళ్లపాలెం చేరుకుంటారు. అక్కడ నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు తిరిగి రోడ్డు మార్గంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి అహ్మదాబాద్‌ వెళ్లనున్నారు.

సభా ప్రాంగణంలో ఏర్పాట్లు

తాళ్లపాలెంలో జాతీయ రహదారికి సమీపంలో సుమారు 80 ఎకరాల లేఅవుట్‌ స్థలాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సభ కోసం సిద్ధం చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర పోలీసు బలగాలు ఇప్పటికే తాళ్లపాలెంలో మోదీ సభా ప్రాంగణంలో గస్తీ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే మోదీ, చంద్రబాబుల కోసం మూడు హెలీప్యాడ్‌లను సిద్ధం చేశారు. సభకు వచ్చే వీఐపీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం డీఐజీ విశాల్‌గున్నీ, అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

చంద్రబాబు పర్యటన వివరాలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కర్నూల్‌ నుంచి బయలుదేరి 3.40 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కశింకోట మండలం ఉగ్గినపాలెంలో హెలీప్యాడ్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. 4.40 గంటలకు ఉగ్గినపాలెం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తాళ్లపాలెం సభా వేదిక వద్దకు 5 గంటలకు చేరుకుంటారు. సభ అనంతరం 6.40 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

Updated Date - May 06 , 2024 | 01:12 AM