Share News

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:47 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఎస్‌పీ తుహిన్‌సిన్హాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత, చిత్రంలో ఎస్‌పీ తుహిన్‌సిన్హా

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత

- జిల్లాలో 30 మారుమూల పోలింగ్‌ కేంద్రాలు మార్పు

- ప్రశాంత ఎన్నికలకు పటి ష్ఠ బందోబస్తు

- ఎస్‌పీ తుహిన్‌సిన్హా

పాడేరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఎస్‌పీ తుహిన్‌సిన్హాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామన్నారు. పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2,689 మంది పీవో, ఏపీవోలకు శిక్షణ పూర్తి చేశామని, మరో 5,115 మంది ఓపీవోలకు వర్చువల్‌గా శిక్షణ ఇస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లో వున్న 30 వరకు పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ అనుమతితో మార్పు చేశామని, ఫలితంగా ఆయా ప్రాంత ఓటర్లు మరింత సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారాలకు రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలన జరిపామని, జిల్లాకు ముగ్గురు(వ్యయం, జనరల్‌, పోలీస్‌ ) ఎన్నికల పరిశీలకులు వస్తారన్నారు. అలాగే ప్రస్తుతం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 7 లక్షల 63 వేల 375 మంది ఓటర్లున్నారన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి 10,271 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేశారని, వారిలో 7,579 మంది దరఖాస్తులను అప్‌డేట్‌ చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనలతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించామని, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించామని చెప్పారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేసుకోవచ్చునని, అయినప్పటికీ వాటి నకలను స్వయంగా రిటర్నింగ్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాగా రంపచోడవరం నియోజకవర్గ పరిధి వై.రామవరం మండలంలోని ఆరు మారుమూల గ్రామాలకు ఎన్నికల సామగ్రిని హెలికాప్టర్‌లో తరలిస్తామని చెప్పారు.

526 మంది వలంటీర్లు రాజీనామా, నలుగురు తొలగింపు

జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 526 మంది గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేశారని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన నలుగురు వలంటీర్లను విధుల్లోంచి తొలగించామన్నారు. ఒక కాంట్రాక్టు ఉద్యోగిని సైతం డిస్మిస్‌ చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి అరకులోయలో 16, పాడేరులో 89, రంపచోడవరంలో 139 ఫిర్యాదు వచ్చాయన్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని, వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. దివ్యాంగులు, కదల్లేని స్థితిలో ఉన్న వృద్దులకు ఇంటి వద్దే ఓటు వేసుకునే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. మే నెల 2 నుంచి 10 తేదీ వరకు ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపడతామన్నారు.

ప్రశాంత ఎన్నికలకు పటి ష్ఠ బందోబస్తు

జిల్లాలో ఎన్నికలను ప్రశాంత ంగా నిర్వహించేందుకు, ప్రజలు నిర్బయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా తెలిపారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు, అభద్రతకు గురికాకుండా పోలింగ్‌లో పాల్గొనేలా రెండు నెలలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్‌, ఇతర కారణాలతో జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదన్నారు. గతేడాదిలో 121 మంది మావోయిస్టు పార్టీతో సంబంధం వున్న వ్యక్తులు సరెండరయ్యారన్నారు. జిల్లాను ఆనుకుని వున్న ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో తొమ్మిది చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో చెక్‌ పోస్టులు వద్ద 17 టాస్క్‌ఫోర్సు బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ పోలింగ్‌ జరగని పెదబయలు మండలం మారుమూల ఇంజెరిలో సైతం ఈసారి పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 156 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ఎక్కడైనా నాటు తుపాకులుంటే తమకు స్వచ్ఛందంగా అప్పగించాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు. అలాగే మారుమూల ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 35 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ జవాను, 40 గ్రేహౌండ్స్‌ పార్టీలు, స్పెషల్‌ పోలీస్‌ పార్టీలు, రాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను సిద్ధం చేశామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అధిక సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటరైన ఘటన ప్రభావం జిల్లాపై లేదన్నారు. పోలీసు బలగాలు సమష్టిగా మావోయిస్టులపై చక్కని విజయం సాధించారని ఎస్‌పీ తుహిన్‌సిన్హా పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:48 AM