Share News

కొత్త పింఛన్లు కొందరికేనా?

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:50 AM

కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే తొలుత అర్హులుగా ప్రకటించి ఆ తరువాత కొంత మందికి ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని పలువురు ఆరోపిస్తున్నారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 13 వేల దరఖాస్తులు రాగా, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి 5,840 మంది అర్హులని అధికారులు ప్రకటించారు. అయితే వీరిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 2,949 మందికి మాత్రమే పింఛన్ల నగదు అందించారు. మిగతా 2,891 మందికి పింఛన్‌ ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

కొత్త పింఛన్లు కొందరికేనా?
అనకాపల్లిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం

జిల్లా వ్యాప్తంగా 13 వేల కొత్త దరఖాస్తులు

5,840 మంది అర్హులుగా గుర్తించిన అధికారులు

కేవలం 2,949 మందికి మాత్రమే నగదు పంపిణీ

పింఛన్‌ ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని 2,891 మంది ఆవేదన

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే తొలుత అర్హులుగా ప్రకటించి ఆ తరువాత కొంత మందికి ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని పలువురు ఆరోపిస్తున్నారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 13 వేల దరఖాస్తులు రాగా, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి 5,840 మంది అర్హులని అధికారులు ప్రకటించారు. అయితే వీరిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 2,949 మందికి మాత్రమే పింఛన్ల నగదు అందించారు. మిగతా 2,891 మందికి పింఛన్‌ ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 13 వేల మందికి పైగా కొత్తగా వైఎస్సార్‌ భరోసా పింఛన్‌ కోసం గ్రామ సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తరువాత సుమారు 5,840 మందికి తొలుత పింఛన్‌ పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. మిగిలిన వారి దరఖాస్తులను తిరస్కరించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి రూ.3 వేలు పింఛన్‌ ఇవ్వాల్సిన జాబితాలో జిల్లాలో కేవలం 2,949 మందికి మాత్రమే కొత్తగా పింఛన్లు అందించారు. మిగతా 2,891 మందికి ఇంకా పింఛన్ల నగదు ఇవ్వకుండా ఏవో సాకులు చెబుతున్నారన్న విమర్శలున్నాయి. తమను తొలుత అర్హులుగా గుర్తించి ఇప్పుడు పింఛన్‌ ఇవ్వకపోవడమేమిటని అర్జీదారులు మండిపడుతున్నారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయకపోవడంపై డీఆర్‌డీఏ పీడీ శచీదేవిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. అర్హత ఉన్నా పింఛన్‌ అందలేదని భావిస్తున్నవారు గ్రామ సచివాలయాల్లో మరోసారి అర్జీ పెట్టుకొని తమకున్న అర్హతా పత్రాలను అందజేయాలని సూచించారు.

Updated Date - Jan 21 , 2024 | 12:50 AM