Share News

సాగునీటి వనరులు గాడిన పడేనా?

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:08 AM

మండలంలో గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వనరులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి నోచుకుంటాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెక్‌ డ్యామ్‌లు, పంట కాలువలు మరమ్మతులకు గురైనా పట్టించుకోలేదు. కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేశారు. దీంతో సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సాగునీటి వనరులు గాడిన పడేనా?
శిథిలావస్థకు చేరిన ధారగెడ్డ మొదటి ఆనకట్ట

ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం

గ్రోయిన్లు, కాలువలకు కనీసం మరమ్మతులు చేయని వైనం

తీవ్రంగా నష్టపోయిన వరి రైతులు

కూటమి ప్రభుత్వం రావడంతో చిగురించిన ఆశలు

గొలుగొండ, జూలై 7: మండలంలో గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వనరులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి నోచుకుంటాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెక్‌ డ్యామ్‌లు, పంట కాలువలు మరమ్మతులకు గురైనా పట్టించుకోలేదు. కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేశారు. దీంతో సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014లో సాగునీటి సంఘాల ద్వారా చెరువుల్లో ఆక్రమణలను తొలగించి పటిష్ఠంగా గట్లు ఏర్పాటు చేశారు. పూడికలు తొలగించే కార్యక్రమం చేపట్టారు. సాగునీటి నిల్వలు పెరగడంతో కింది పంట పొలాలకు సాగునీరు సమృద్ధిగా అందే విధంగా కృషి చేశారు. చెరువుల మదాలు, ఆనకట్టల గేట్లు ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక సాగునీటి వనరులను నిర్లక్ష్యం చేసింది. దీంతో మండలంలోని సాగునీటికి రైతులు పాట్లు పడుతున్నారు. మండలంలో పాతవల్లంపేట గ్రామ పంచాయతీలో గల ధారగెడ్డ తొలి ఆనకట్ట ఎండాకాలంలోనూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఈ ఆనకట్ట ఐదేళ్లుగా మరమ్మతులకు గురికావడంతో సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. ఆనకట్ట కింద సుమారు వెయ్యి ఎకరాల సాగుభూమి ఉంది. ఖరీఫ్‌, రబీ సాగు చేపడుతుంటారు. నిత్యం గెడ్డలు ప్రవహించినప్పటికీ ఆనకట్ట మరమ్మతులకు గురికావడంతో పైనుంచి వచ్చే నీరు వచ్చినట్టే కిందకు పోవడంతో ఖరీఫ్‌ సాగులో పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట కాలువల్లో తుప్పలు, పూడిక పేరుకుపోవడంతో వరి పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో సాగు పెట్టుబడి రాని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి చెరువుల్లో కనీసం పేరుకుపోయిన తుప్పలు తొలగించలేని పరిస్థితులు మండలంలోని పలు గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. ఏటా నిధుల మంజూరుకు గత వైసీపీ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. కూటమి ప్రభుత్వం రావడంతో ఈ ఏడాదైనా మరమ్మతులు చేపట్టి ఖరీఫ్‌, రబీ సాగుకు సాగునీరు అందే విధంగా పాలకులు, అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ మండల జేఈ సూర్యనారాయణను సంప్రతించగా ధారగెడ్డ ఆనకట్ట మరమ్మతులు, పంట కాలువల్లో పూడికతీతకు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 12:08 AM