యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:39 AM
జిల్లాలో ప్రధాన రహదారుల పక్కన, సమీపంలో అక్రమ లేఅవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రియల్టర్లు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, సంబంధిత శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా వ్యవసాయేతర అవసరాలకు మార్చేస్తున్నారు. ఇళ్ల స్థలాల లేఅవుట్‌లు వేసి, గజాల చొప్పున ప్లాట్‌లుగా వేస్తున్నారు. అయినా సరే ఏ ఒక్క శాఖ అధికారి కూడా పట్టించుకోవడంలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది.

వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్న రియల్టర్లు
పంచాయతీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు నిల్
నాలా, ఇతర పనులు చెల్లించకుండానే భూమి చదును పనులు
ప్లాట్లుగా విభజించి గజాల చొప్పున అమ్మకం
ప్రభుత్వ ఆదాయానికి గండి
చోద్యం చూస్తున్న నియంత్రణ శాఖల అధికారులు
అనకాపల్లి మండలం కొండకొప్పాక వద్ద రైల్వే ఫ్లైఓవర్ వంతెనకు సమీపంలో అవఖండం వ్యవసాయ భూముల్లో అనకాపల్లికి చెందిన ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వంద ఎకరాల్లో భారీ లేఅవుట్ వేస్తున్నారు. నెల రోజుల నుంచి పనులు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్ వేస్తున్నారని స్థానికులు రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడం లేదు.
----
పిసినికాడ పంచాయతీ బీఆర్‌టీ కాలనీకి ఆనుకొని సుమారు 70 ఎకరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ లేఅవుట్ వేసింది. ఇప్పటికే భూమిని చదును చేసి ప్లాట్‌లుగా విభజించే పనులు చేపట్టారు. ఈ లేఅవుట్‌కు కూడా అనుమతులు లేవు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా పనులు ఆపేశారు.
---
ఇటువంటి అనధికార లేఅవుట్‌లు అనకాపల్లి మండలంలోనే కాకుండా జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ రోడ్ల పక్కన వున్న మండలాల్లో కోకొల్లలుగా వున్నాయి.
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రధాన రహదారుల పక్కన, సమీపంలో అక్రమ లేఅవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రియల్టర్లు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, సంబంధిత శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా వ్యవసాయేతర అవసరాలకు మార్చేస్తున్నారు. ఇళ్ల స్థలాల లేఅవుట్‌లు వేసి, గజాల చొప్పున ప్లాట్‌లుగా వేస్తున్నారు. అయినా సరే ఏ ఒక్క శాఖ అధికారి కూడా పట్టించుకోవడంలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది.
జిల్లాల పునర్విభజన తరువాత అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ జిల్లాపై కన్నేశాయి. ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేయడానికి జాతీయ రహదారి పక్కనున్న అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలతోపాటు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఆర్‌అండ్‌బీ రహదారుల పక్కనున్న మండలాల్లో వ్యవసాయ భూములను ఎడాపెడా కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్‌కవేటర్లతో చదును భూములను చదును చేస్తున్నారు. గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి, గ్రావెల్‌తో రోడ్లు నిర్మిస్తున్నారు. చుట్టూ గోడలు/ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో కూడా లేఅవుట్‌లు వెలస్తున్నాయి. అనధికార సమాచారం ప్రకారం జిల్లాలోని వివిధ మండలాల్లో 350కిపైగా అనుమతులు లేని లేఅవుట్‌లు వున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లకు అన్ని అనుమతులు వున్నాయంటూ ప్రజలను మభ్యపెట్టి స్థలాలను అమ్ముతున్నారు. కొనుగోలుదారులు ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు.. లేఅవుట్‌కు అనుమతులు లేవని తెలుసుకుని కంగుతింటున్నారు. అనకాపల్లి మండలం కూండ్రం, కుంచంగి, కొప్పాక, సిరసపల్లి, మారేడుపూడి, పిసినికాడ, రేబాక, శంకరం పరిసరాల్లో అనుమతులు లేకుండా వేసిన ప్రైవేటు లేఅవుట్‌లలో స్థలాలు కొనుగోలు చేసిన పలువురు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎల్‌పీసీల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాల్సి వస్తే రెవెన్యూ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. భూమి మార్పిడి (నాలా) అనుమతుల కోసం స్థానిక గ్రామ పంచాయతీకి కొంత రుసుము చెల్లించాలి. తరువాత వీఎంఆర్‌డీఏ పరిధిలో వుంటే ఆ అథారిటీ నుంచి కూడా అనుమతి పొందాలి. వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు పొందిన తరువాత విద్యుత్, రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించి, ప్లాట్‌లుగా విభజించి విక్రయించాలి. కానీ జిల్లాలో ఎక్కువ మంది రియల్టర్లు ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చేసి, ప్లాట్లు వేసి దర్జాగా అమ్ముకొంటున్నారు. అంతేకా లేఅవుట్‌లో సామాజిక అవసరాలకు 10 శాతం స్థలాన్ని విడిచిపెట్టడంలేదు. స్థానిక పంచాయతీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ అధికారులు అనధికార లేఅవుట్‌లపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్థానిక ప్రజాప్రతినిధులు అండగా వుండడంతో ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.