అరకులోయ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత
ABN , Publish Date - Mar 24 , 2024 | 11:43 PM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అరకులోయ పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేసింది. అరకులోయ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను ఖరారు చేసింది. ఆదివారం రాత్రి ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.
ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
పాడేరు అసెంబ్లీకి ఉమామహేశ్వరరావును ఖరారు చేసే అవకాశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అరకులోయ పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేసింది. అరకులోయ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను ఖరారు చేసింది. ఆదివారం రాత్రి ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. కాగా పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా కురుసా ఉమామహేశ్వరరావును బరిలో దింపుతున్నట్టు సమాచారం.
కొత్తపల్లి గీత రాజకీయ ప్రస్థానం
మాజీ ఎంపీ కొత్తపల్లి గీత 2014 నుంచి 2019 నుంచి అరకులోయ ఎంపీగా ఈ ప్రాంతానికి సుపరిచితురాలు కావడంతోనే తాజాగా తమ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి గీత ఎంఏ వరకు విద్యను అభ్యసించి గ్రూప్- 1 అధికారిగా సేవలందించారు. ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడంతో గ్రూప్- 1 ఉద్యోగాన్ని సైతం వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. 2014లో ఆమె అరకులోయ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతూనే 2018లో స్వయంగా జనజాగృతి పేరిట ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2019లో దానిని బీజేపీలో విలీనం చేశారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో 2023 ఆగస్టులో కొత్తపల్లి గీత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అరకులోయ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న ఆమెకు ఆ సీటు దక్కింది.
పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఖరారు!
పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావును ఆ పార్టీ అధిష్ఠానం బరిలో దింపుతున్నట్టు తెలిసింది. మూడు వారాల క్రితం వరకు పాడేరు అసెంబ్లీ స్థానం టీడీపీకి కేటాయిస్తారనుకున్నప్పటికీ, కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. దీంతో గతవారం రోజులుగా తమ అభ్యర్థిగా ఎవర్ని బరిలో దింపాలనే దానిపై బీజేపీ కసరత్తు చేసింది. ఆఖరికి బీజేపీ నేత ఉమామహేశ్వరరావును ఖరారు చేసినట్టు సమాచారం. బీజేపీ అగ్ర నేతలైన వెంకయ్యనాయుడు, పీవీ చలపతిరావు, కంభంపాటి హరిబాబు వంటి వారితో కలిసి బీజేపీలో పని చేసిన కొత్తపాడేరు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కురుసా బొజ్జయ్య తనయుడే ఉమామహేశ్వరరావు. ఆయనకు సైతం రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గత 25 ఏళ్లుగా పంచాయతీ మొదలుకుని పార్లమెంట్ స్థానం వరకు భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర కాఫీ బోర్డు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.