Share News

అర్జీలను 24 గంటల్లో పరిశీలించాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:40 PM

సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖాధికారులు వెబ్‌సైట్‌లో నమోదుచేసిన 24 గంటల్లో పరిశీలించకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు.

అర్జీలను 24 గంటల్లో పరిశీలించాలి
మీ కోసంలో ప్రజల అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఇతర అధికారులు

లేకుంటే షోకాజ్‌ నోటీసులు జారీచేస్తా

అధికారులకు కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో

166 వినతులు స్వీకరణ

పాడేరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖాధికారులు వెబ్‌సైట్‌లో నమోదుచేసిన 24 గంటల్లో పరిశీలించకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఆయా వినతుల పరిశీలన ప్రక్రియను చేపట్టకపోతే అధికారులకు తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రజలిచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

మీ కోసం కార్యక్రమంలో 166 వినతులు స్వీకరణ

ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ్‌, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ శార్యమన్‌ పటేల్‌, డీఆర్‌వో బి.పద్మావతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 166 వినతులను స్వీకరించారు. వాటిలో ప్రధానంగా రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు, అటవీ హక్కు పత్రాలు, ఉపాధి అవకాశాల కోసం అధికంగా వినతులు అందాయి. చింతపల్లి మండలం బెన్నవరం గ్రామానికి చెందిన గోమంగి సుబ్బారావు, పాంగి రాజారావు తదితర 40 మంది గిరిజన రైతులు.. తమకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరగా, పాడేరు మండలం కించూరు సర్పంచ్‌ వంతాల రాంబాబు తమ పంచాయతీలో గొండెలి గ్రామం నుంచి కించూరు మీదుగా పెదకోడాపల్లి వరకు తారురోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ దారపురం గ్రామస్థులు కె.బింగు, జి.కేశవరావు, పి.ముర్రులు తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరగా, కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీ గాంకొండ గ్రామస్థులు నడిపాలెం మెయిన్‌రోడ్డు నుంచి గాంకొండ గ్రామం వరకు తారురోడ్డు నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. అలాగే ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు పంచాయతీ తేనెలమామిడి గ్రామస్థులు బరడ గ్రామం నుంచి తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరగా, చింతపల్లి మండల కేంద్రానికి చెందిన కోమర్తి లక్ష్మణరావు అనే దివ్యాంగుడు తమకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల మోటారు సైకిల్‌ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఇన్‌చార్జి డీడీ ఎల్‌.రజని, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు జి.డేవిడ్‌రాజు, కె.వేణుగోపాల్‌, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి జమాల్‌ బాషా, ఆర్‌అండ్‌బీ ఈఈ బాల సుందరబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:40 PM