Share News

నెరవేరని మరో హామీ

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:11 AM

వయోభారం, అధిక బరువు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కీళ్లు అరిగిపోయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

నెరవేరని మరో హామీ

‘కీళ్ల మార్పిడి’ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటన

ఏళ్లు గడుస్తున్నా అమలు చేయని ప్రభుత్వం

ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూలు

అంత స్థోమత లేక మంచాలకే పరిమితమవుతున్న నిరుపేదలు

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

వయోభారం, అధిక బరువు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కీళ్లు అరిగిపోయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. ఇప్పుడు ఒబెసిటీ వల్ల చిన్న వయసులోనే కీళ్ల అరుగుదల కనిపిస్తోంది. ఈ తరహా ఇబ్బందులతో బాధపడే వారికి కీళ్ల మార్పిడి (జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌) చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, ఈ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో వందలాది మంది నిరుపేదలు శస్త్రచికిత్సలు చేయించుకోలేక మంచానికే పరిమితమవుతున్నారు.

తీవ్ర ఇబ్బందులతో సతమతం..

వయసుతో నిమిత్తం లేకుండా కీళ్ల సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య గడిచిన కొన్నాళ్ల నుంచి భారీగా పెరుగుతోంది. వైద్యుల వద్దకు వచ్చేవారిలో దాదాపు ఐదు శాతం మంది వారే ఉంటున్నారు. రెండు నుంచి మూడు శాతం మందికి మందులు ద్వారా కొంత ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు శాతం మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంప్లాంట్‌ను బట్టి శస్త్ర చికిత్సకు ఫీజు వసూలుచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చినట్టయితే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశముంది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

గతంలో ఈ తరహా శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. ప్రస్తుతం విశాఖలోనే పలు ఆస్పత్రుల్లో ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. నగరంలో పదికిపైగా ఆస్పత్రుల్లో జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు.

Updated Date - Mar 27 , 2024 | 01:11 AM