ఆస్తి పన్ను మరో 15% పెంపు
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:58 AM
ఆస్తి పన్ను పెంపునకు జీవీఎంసీ అధికారులు మళ్లీ సిద్ధమయ్యారు.
ఆన్‌లైన్‌లో డిమాండ్ నోటీసులు
2023-24లో రూ.460 కోట్లు పన్ను వసూలు
2024-25కి రూ.535 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం
గత ఏడాది కంటే రూ.75 కోట్లు అదనపు భారం
అద్దె ఆధారంగా కాకుండా ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం
ఎన్నికల్లో తమకు ప్రతికూల అంశంగా మారుతుందని వైసీపీ అభ్యర్థుల్లో గుబులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘‘నగరంలో అబిద్‌నగర్ ప్రాంతంలో గల ఒక ఇంటికి ఆస్తి పన్ను 2021-22లో రూ.11,576 ఉండగా, కొత్త విధానం అమలు తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.13,170కి పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.13,352కి, 2024-25 ఆర్థి సంవత్సరానికి రూ.14,698కి పెంచుతూ డిమాండ్ నోటీస్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉంచారు.’’
‘‘మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని ఒక ఇంటికి 2021-22లో ఆస్తి పన్ను రూ.1,410 ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,146కి పెంచుతూ డిమాండ్ నోటీస్ సిద్ధం చేశారు.’’
ఆస్తి పన్ను పెంపునకు జీవీఎంసీ అధికారులు మళ్లీ సిద్ధమయ్యారు. గత రెండేళ్లుగా 15 శాతం వరకూ పెంచుతూ వస్తున్న అధికారులు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరో 15 శాతం పన్ను పెంచుతూ డిమాండ్ నోటీసులను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇదిలావుండగా ఎన్నికల వేళ ఆస్తి పన్ను పెంచుతూ డిమాండ్ నోటీసులు జారీచేయడం తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని జీవీఎంసీ పరిధిలో గల నియోజకవర్గాలకు చెందిన వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం నివాస, నివాసేతర భవనాలతోపాటు ఖాళీ స్థలాలకు సంబంధించి 5,72,356 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.350 కోట్లు వరకూ ఆస్తి పన్ను వసూలయ్యేది. మునిసిపల్ వ్యవస్థ ఆరంభం నుంచి నివాస, నివాసేతర భవనాలకు ఆస్తి పన్నును వాటి వార్షిక అద్దె ఆధారంగా విధిస్తూ వస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆస్తి విలువ ఆఽధారంగా పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆస్తి పన్ను చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం నివాస భవనాలకు ఆస్తి విలువలో 0.12 శాతం, నివాసేతర భవనాలకు 0.30 శాతం, ఖాళీ స్థలాలకు 0.50 పన్ను విధించేలా మార్గదర్శకాలు రూపొందిస్తూ 2021లో జీవో (నంబర్ 198) విడుదల చేసింది. దీనిని 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచే అమలుచేసేలా కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని జీవీఎంసీకి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన ఆధారంగా 2021 ఆగస్టు ఏడున జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆస్తి పన్ను సవరణ చట్టాన్ని ఆమోదించింది. కొత్తవిధానం వల్ల అద్దెలు పెరిగిపోతాయని, సామాన్యులు ఇబ్బంది పడతారని విపక్షాలు అభ్యంతరం తెలపడంతోపాటు, పెంపు ప్రతిపాదనను రెండేళ్లపాటు వాయిదా వేయాలంటూ కౌన్సిల్‌లో ఆందోళనకు దిగాయి. అయినప్పటికీ కౌన్సిల్‌లో వైసీపీకి మెజారిటీ ఉండడంతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతో 2021 రెండో అర్ధ సంవత్సరం నుంచే కొత్త ఆస్తిపన్ను చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు 2021-22 సంవత్సరంలో రూ.450.42 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.396.25 కోట్లు వసూలైంది. 2022-23 సంవత్సరంలో రూ.475.51 వసూలు లక్ష్యంగా పెట్టుకుంటే రూ.422.15 కోట్లు వసూలైంది. 2023-24 సంవత్సరంలో రూ.504.65 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా రికార్డు స్థాయిలో రూ.460.12 కోట్లు వసూలైంది. ఇది అంతకుముందు సంవత్సరం వసూలైన ఆస్తి పన్నుతో పోల్చితే దాదాపు రూ.38 కోట్లు అధికం. అదే 2021-22 ఆర్థిక సంవత్సరంతో మాత్రం రెండేళ్లలో రూ.64 కోట్లు ప్రజలపై అదనపు భారం పడింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.535.16 కోట్లు వసూలు చేయాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది వసూలైన మొత్తంతో పోల్చితే తాజా ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై రూ.75 కోట్లు అదనపు భారం మోపడానికి సిద్ధమైంది.
మరో 15 శాతం పెంచుతూ ఆన్‌లైన్‌లో నోటీసులు
2021-22 రెండో అర్ధ సంవత్సరం నుంచి ఆస్తి పన్ను పెంచుతూ వస్తున్న జీవీఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరో 15 శాతం వరకూ పెంచుతూ డిమాండ్ నోటీసులు సిద్ధం చేసింది. కొత్త విధానంలో ఇల్లు ఉన్న ప్రాంతంలో స్థలం ప్రభుత్వ ధరతోపాటు ఆ ఇంటిని నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని లెక్కిస్తారు. మొత్తం విలువలో 0.12 శాతాన్ని ఆస్తి పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లెక్కిస్తే ప్రతి అసెస్‌మెంట్‌కు ఆస్తి పన్ను ఒకేసారి రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఒకేసారి పన్ను రెట్టింపు మొత్తంలో కట్టాలని డిమాండ్ నోటీసు ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. పెరిగిన ఆస్తి పన్నును ఒకేసారి కాకుండా ఏడాదికి 15 శాతానికి మించకుండా పెంచుకుంటూ వెళ్లాలని (కొత్త విధానంలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తానికి సమానమయ్యేంత వరకూ) నిర్ణయం తీసుకుంది. ఒకవేళ 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి చెల్లించే పన్నుకు కొత్త విధానంలో పెరిగే పన్నుకు వ్యత్యాసం పెద్దగా లేదనుకుంటే ఏటా ఐదు, పది శాతం చొప్పున మాత్రమే పెంచుతూ అధికారులు డిమాండ్ నోటీసులు సిద్ధం చేస్తున్నారు.
వైసీపీ అభ్యర్థుల్లో గుబులు
ఎన్నికలు ముందు ఆస్తి పన్ను పెంచుతూ డిమాండ్ నోటీసులు జారీచేయడం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తి పన్ను గత రెండేళ్ల నుంచి పెంచుతున్నప్పటికీ...ఇప్పుడు, ఎన్నికల సమయంలో మరోసారి ఆస్తిపన్ను పెంచుతూ డిమాండ్ నోటీసులు అందితే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నోటీసులు ప్రత్యక్షంగా జారీచేయడాన్ని అధికారులు తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. తద్వారా పన్ను ఎంత పెంచారనేది తెలుస్తుందని, ఇది కచ్చితంగా వ్యతిరేక అంశమేనని అభ్యర్థులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
గత మూడేళ్లలో ఆస్తి పన్ను వసూళ్ల వివరాలు
సంవత్సరం డిమాండ్ (కోట్లలో) వసూలు (కోట్లలో)
2021-22 రూ.450.42 రూ.396.25
2022-23 రూ.475.51 రూ.422.15
2023-24 రూ.504.65 రూ.460.12
2024-25 రూ.535.16 రూ.20.16 (ఏప్రిల్ 11 నాటికి)