Share News

కదంతొక్కిన అంగన్‌వాడీలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:44 PM

సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌పై సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం వివిధ రూపాల్లో బెదిరింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ బుధవారం కలెక్టర్‌ ముట్టడి కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.

కదంతొక్కిన అంగన్‌వాడీలు
పాడేరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

సర్కారు బెదిరింపులకు నిరసనగా కలెక్టరేట్‌ ముందు ధర్నా

పాడేరుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ఆయాలు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌పై సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం వివిధ రూపాల్లో బెదిరింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ బుధవారం కలెక్టర్‌ ముట్టడి కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కలెక్టరేట్‌ల ముట్టడికి సంఘం పిలుపునివ్వడంతో ఏజెన్సీలోని అన్ని మండలాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు జిల్లా కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటల నుంచే చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి సమీపంలోని ఓ ప్రదేశానికి చేరుకుని అక్కడి నుంచి సుమారుగా కిలో మీటరున్నర దూరంలో వున్న కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి సినిమా హాల్‌ సెంటర్‌, పీటీడీ కాంప్లెక్స్‌ మీదుగా కలెక్టర్‌ కార్యాలయానికి ఈ ర్యాలీ సాగింది. కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన గేటు వద్ద అంగన్‌వాడీలను పోలీసులు అడ్డగించడంతో ప్రధాన గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ ధర్నా చేపట్టి తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

సర్కారు మొండి వైఖరి వల్లే..

సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి కారణంగానే వారిలో పోరాట పటిమ అధికమైందని తెలుస్తున్నది. అందువల్లే బుధవారం కలెక్టర్‌ ముట్టడి కార్యక్రమానికి భారీ స్థాయిలో అంగన్‌వాడీలు హాజరై సంపూర్ణంగా విజయవంతం చేశారని సంఘం నేతలు అంటున్నారు. కాగా అంగన్‌వాడీలు సమ్మెను విరమించి ఈ నెల ఐదో తేదీలోగా విధుల్లో చేరకుంటే, ప్రత్యామ్నాయం చూసుకుంటామని ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ప్రకటనలు ఇప్పించడంపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. గతంలోనూ అక్రమంగా అంగన్‌వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, సచివాలయ సిబ్బందితో నడపాలని భావించి భంగపడడం, ఆ తరువాత సమీపంలోని పాఠశాలల్లో చిన్నారులకు పోషకాహారాన్ని అందించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ప్రభుత్వం తాజాగా కలెక్టర్‌లతో అంగన్‌వాడీలకు పరోక్ష హెచ్చరికలు చేయించింది. అయినప్పటికీ అంగన్‌వాడీలు ఎక్కడా తగ్గకుండా కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేసి తమ సత్తాను చాటారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె బుధవారానికి 23వ రోజుకు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 14వ రోజుకు చేరింది. దీంతో స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 10:44 PM