Share News

అంగన్‌వాడీల ఆందోళన ఉధృతం

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:18 AM

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని, తదితర డిమాండ్లతో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారంనాటికి 33వ రోజుకు చేరింది. గత ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చి నాలుగురేళ్లయినా అమలు చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంగన్‌వాడీల ఆందోళన ఉధృతం
అనకాపల్లిలో ఎస్మా జీవో కాపీలు, షోకాజ్‌ నోటీసులను భోగిమంటల్లో దహనం చేస్తున్న అంగన్‌వాడీలు

దీక్షా శిబిరాల వద్ద భోగి మంటలు

ఎస్మా జీవో కాపీలు, షోకాజ్‌ నోటీసులు దహనం

పండుగ పూట పస్తులుంచిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సత్తా చూపుతామని హెచ్చరిక

33వ రోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని, తదితర డిమాండ్లతో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారంనాటికి 33వ రోజుకు చేరింది. గత ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చి నాలుగురేళ్లయినా అమలు చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా వైసీపీ పాలకుల తీరును నిరసిస్తూ శనివారం అన్ని ధర్నా శిబిరాల వద్ద పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద భోగిమంటలు వేసి ఎస్మా జీవో కాపీలు, అంగన్‌వాడీలకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను మంటల్లో వేసి దహనం చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట లక్షలాది కుటుంబాలను పస్తులు వుంచిన ఘనత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సమ్మెను విరమించేది లేదని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో వైసీపీకి చూపికి చూపిస్తామని హెచ్చరించారు.

ఐద్వా రాష్ట్ర అధ్యక్షరాలు బి.ప్రభావతి సబ్బవరంలో అంగన్‌వాడీల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించడం దారుణమని అన్నారు. కాగా ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ చీడికాడలో అంగన్‌వాడీలు ఇంటింటికీ వెళ్లి భిక్షాటనతో నిరసన తెలిపారు. అంగన్‌వాడీలపట్ల నీచంగా మాట్లాడారంటూ దేవరాపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫొటోలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. తమ ఆందోళన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, కావాలనే రాద్ధాతం చేస్తున్నామని సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 01:18 AM