Share News

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ‘బూడి’

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:04 AM

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్త పేరును వైసీపీ అధిష్ఠానం ఎట్టకేలకు మంగళవారం ప్రకటించింది.

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ‘బూడి’

ఉప ముఖ్యమంత్రిని సమన్వయకర్తగా నియమించిన అధిష్ఠానం

మాడుగుల ఇన్‌చార్జిగా ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ

అనకాపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్త పేరును వైసీపీ అధిష్ఠానం ఎట్టకేలకు మంగళవారం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పేరును ఖరారు చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా ముత్యాలనాయుడు పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మాడుగుల నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిసింది.

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను అనకాపల్లి మినహా మిగిలిన అన్ని స్థానాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల పేర్లను ఈ నెల 16వ తేదీన పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. జాబితాలో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరు వద్ద ఖాళీ ఉంచి, ‘కేటగిరి’ కాలమ్‌లో ‘బీసీ’ అని మాత్రమే పేర్కొన్నారు. కాగా అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి కూటమి తరపున తొలుత జనసేన పోటీ చేయాలని భావించింది. కానీ బీజేపీతో టీడీపీ-జనసేన పార్టీలకు పొత్తు కుదిరిన తరువాత ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దాంతో బీజేపీ అభ్యర్థిని బట్టి తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పెద్దలు భావించారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ పోటీ చేస్తారని వెల్లడి కావడంతో వైసీపీ అధిష్ఠానం ఉపముఖ్యమంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పేరును మంగళవారం ప్రకటించింది. మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయన కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధను నియమించారు.

Updated Date - Mar 27 , 2024 | 01:04 AM