Share News

అనకాపల్లి దశ మారుస్తా..

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:48 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారాహి విజయభేరి యాత్రంలో భాగంగా ఆదివారం అనకాపల్లి నెహ్రూ చౌక్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

అనకాపల్లి దశ మారుస్తా..
రోడ్డు షోలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌

కూటమితోనే భవిష్యత్తు

విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి

రాష్ట్రాభివృద్ధి కోసమే జనసేన పోరాటం

యువతకు ఉపాధి, ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం

వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలి

వారాహి విజయభేరి సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌

అనకాపల్లి/ కొత్తూరు/ అనకాల్లి టౌన్‌ ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారాహి విజయభేరి యాత్రంలో భాగంగా ఆదివారం అనకాపల్లి నెహ్రూ చౌక్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ మన ముందున్న సవాళ్లని, కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పోరాడుతోందని, అధికారం కోసం కాదని పవన్‌ స్పష్టం చేశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం అనకాపల్లి నెహ్రూ చౌక్‌లో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో అనకాపల్లి జన సంద్రాన్ని తలపించింది. సుంకరమెట్ట కూడలి నుంచి నెహ్రూచౌక్‌ వరకు ర్యాలీగా వచ్చిన జనసేనానికి అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వైసీపీ కోడి ఒక గుడ్డు పెట్టింది, ఒక డిప్యూటీ సీఎంను ఇచ్చింది కానీ ఒక మంచి రోడ్డు వేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్‌ను గెలిపించుకుంటే కేంద్రం సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తరచూ గళమెత్తే నేత కొణతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని నష్టాల సాకుతో మూసేశారని, అధికారంలోకి వచ్చాక తెరిపిస్తామన్న వైసీపీ నేతలు దానిని రియల్‌ ఎస్టేట్‌ పీస్‌గా మార్చేసి రూ.300 కోట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఇథనాల్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ఏడు వేల మంది ఉన్నారని, వారిలో కేవలం 1,400 మందికే ఉపాధి దక్కిందన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అందరికీ ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. అనకాపల్లి, కశింకోట మండలాల్లో గ్రోయిన్ల మరమ్మతులు చేపట్టి రైతాంగానికి సహకరిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్నింటినీ పూర్తిచేస్తామన్నారు. బెల్లం రైతులకు అగ్రి మార్కెట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అనకాపల్లి బెల్లానికి గ్లోబల్‌ ట్యాగ్‌ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

ఎన్టీఆర్‌ ఆస్పత్రి పూర్వ వైభవానికి కృషి

స్థానిక ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హయాంలో ఏసీలు ఏర్పాటు చేస్తే, అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. వైద్యం కోసం గర్భిణులు ఆస్పత్రికి వస్తే ప్రతి రోగినీ విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేయడం అన్యాయమన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌ ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకువస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంగా అనకాపల్లికి స్థానం దక్కినా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయని, ఈ ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేకపోయిందని విమర్శించారు. నిధులను దోచుకోవడమే వైసీపీ నేతలకు తెలిసిన అభివృద్ధి అన్నారు. జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం పక్కనే ఉన్న డంపింగ్‌ యార్డును తొలగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు విశాఖను గంజాయి కేంద్రంగా మార్చేశారని, కూటమి అధికారంలోకి రాగానే గంజాయి మహమ్మారిని అరికడతామన్నారు. కాపు సామాజిక భవనం కోసం టీడీపీ హయాంలో స్థలం కేటాయిస్తే అక్కడ వైసీపీ కార్యాలయం నిర్మించడం కంటే అన్యాయం ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 3,416 టిడ్కో ఇళ్లు నిర్మిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం 1,200 ఇళ్లను వైసీపీ నేతలకు కేటాయించారని, అన్నింటినీ సరిదిద్దుతామన్నారు.

నూకాలమ్మ జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు

అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర స్థాయి పండగలా నిర్వహిస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలకు రెండు పూటలా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని, రోడ్డు విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు ఇస్తామన్నారు. పీలా గోవింద సత్యనారాయణ హయాంలో ప్రారంభించిన పెరుగుబజారు రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేస్తామన్నారు. కశింకోటలో శారదానదిపై వంతెన నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలంటే సీఎం రమేశ్‌ను ఎంపీను చేయాలన్నారు. పేదలు సాగుచేస్తున్న జీడీ, మామిడి రైతులకు, భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామన్నారు. రైతుబజారు ఏర్పాటు చేస్తామన్నారు. నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామన్నారు. శారదానది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవన కేంద్రాలు, పెద్దలకు వాకింగ్‌ ట్రాక్‌, టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మండపాలు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా భవన నిర్మాణాలు చేపడతామన్నారు. బవులవాడు, దర్జీనగర్‌ రోడ్డు అభివృద్ధి, అనకాపల్లి పూడిమడక రోడ్డును నిర్మాణం చేపడతామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని మైనింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

కోడిగుడ్డు మంత్రిని తట్టుకోలేని సీఎం

కోడిగుడ్డు మంత్రి అవినీతిని తట్టుకోలేకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమర్‌నాథ్‌కు అనకాపల్లిలో టికెట్టు ఇవ్వలేకపోయారని పవన్‌ ఆరోపించారు. కశింకోట మండలం విస్సన్నపేటలో భూ కుంభకోణానికి పాల్పడిన మంత్రి తన బినామీలతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇనాం భూములను దోచుకున్నారన్నారు. పిసినికాడలో 80 ఎకరాల దళితుల అసైన్డ్‌ భూమిని తక్కువ ధరకు లాక్కున్నారన్నారు. జగనన్న కాలనీల్లో భూములను అమ్ముకున్నారని, కూటమి అధికారంలోకి రాగానే వీటన్నింటిపై విచారణ చేపడతామని హెచ్చరించారు.

పోలవరం మరిచి డ్యాన్స్‌లు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ పార్టీ నాయకులకు డ్యాన్స్‌లు వేయడం తప్ప సమాధానం చెప్పే సత్తా లేదన్నారు. పోలవరం పూర్తికి కేంద్ర సహాయం అవసరమని, ఇందుకోసం సీఎం రమేశ్‌ విజయం కీలకమమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సమస్యలను పరిష్కరించుకుని, సొంత గనులు కేటాయించేలా చూస్తానన్నారు. అందరం కలిసి వస్తే ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యమేనన్నారు.

జనసేనానికి నీరాజనం

అనకాపల్లి టౌన్‌: వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అనకాపల్లి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. జలగలమదుం జంక్షన్‌ సమీపాన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు పవన్‌కల్యాణ్‌ హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.45 గంటలకు వచ్చారు. ఆయనకు బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన అభ్యర్థులు పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్‌, కూటమి పార్టీల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పవన్‌కల్యాణ్‌ను కొణతాల రామకృష్ణ సత్కరించి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పలువురు నాయకులు కొణతాల సమక్షంలో జనసేనలో చేరారు. సాయంత్రం 5.25 గంటలకు వారాహి విజయయాత్ర హెలీప్యాడ్‌ నుంచి ప్రారంభమైంది. ఈ ర్యాలీ సత్తెమ్మ తల్లి ఆలయ ముఖద్వారం, ఆంధ్రాబ్యాంక్‌ రోడ్డు, వన్‌వే ట్రాఫిక్‌ జంక్షన్‌, చేపల బజారు మీదుగా నెహ్రూచౌక్‌కు సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంది. ఓపెన్‌ టాప్‌ వాహనం పైనుంచి ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా అభిమానులు, పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు. పలుచోట్ల మహిళలు మంగళహారతులు ఇచ్చారు. రింగురోడ్డు జంక్షన్‌లో ఒక యువతి చేతిలో హారతిని వెలిగించి పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు. సత్యనారాయణ థియేటర్‌ వద్ద ఒక చంటి బిడ్డను పవన్‌కల్యాణ్‌ ముద్దాడారు. ఈ ర్యాలీలో మార్గమధ్యంలోని కుంచావారి గౌరీ పరమేశ్వరులు, వేల్పులవీధి గౌరీ పరమేశ్వరులను వాహనం పైనుంచే దర్శించుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు దారి పొడవునా బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Apr 07 , 2024 | 11:48 PM