తగ్గని పొగమంచు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:26 AM
పాడేరులో సోమవారం ఉదయం పది గంటల తరువాతే సూర్యుడు కనిపించాడు. పది గంటలు దాటే వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది.
- జి.మాడుగులలో 12.9 డిగ్రీలు నమోదు
పాడేరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పాడేరులో సోమవారం ఉదయం పది గంటల తరువాతే సూర్యుడు కనిపించాడు. పది గంటలు దాటే వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది. సోమవారం ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ పొగ మంచు, చలి ప్రభావం మాత్రం తగ్గకపోవడం విశేషం. సోమవారం జి.మాడుగులలో 12.9, ముంచంగిపుట్టులో 13.7, అనంతగిరిలో 14.2, పెదబయలులో 14.3, అరకులోయలో 15.1, డుంబ్రిగుడలో 15.6, పాడేరులో 15.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో పాటు పొగమంచు ఉదయం పది గంటల వరకు దట్టంగా అలముకుంటున్నది.
జీకేవీధి, చింతపల్లిలో..
చింతపల్లి: మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా చలిలో మార్పులేదు. 20 రోజులుగా ఏజెన్సీ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. జీకేవీధిలో 13.4, చింతపల్లిలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఉదయం, సాయంత్రం శీతల గాలులు అధికంగా వీస్తున్నాయి. చలితో పాటు మంచు అధికంగా కురుస్తున్నది. ఉదయం పదిన్నర గంటల వరకు లంబసింగి, తాజంగి, చింతపల్లి, ఆర్‌వీనగర్, జీకేవీధి ప్రాంతాల్లో మంచు వీడడం లేదు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో మంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించలేదు. దీంతో హెడ్‌లైట్లు వేసుకుని వాహనచోదకులు రాకపోకలు సాగించారు. చలి గాలులు తీవ్రంగా వీస్తుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.