భావితరాలకు స్ఫూర్తి అల్లూరి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:54 AM
భావితరాలకు స్ఫూర్తిగా అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

సీతారామరాజు స్మారక ప్రాంతాల అభివృద్ధి అవశ్యం
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఘనంగా అల్లూరి జయంతి
అల్లూరి, గంటందొరల సమాధుల వద్ద నివాళి
కృష్ణాదేవిపేట, జూలై 4: భావితరాలకు స్ఫూర్తిగా అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి సమాధులున్న పార్కులో గురువారం అల్లూరి 127వ జయంతి సందర్భంగా అల్లూరి, గంటందొరల సమాధులకు, విగ్రహాలకు అయ్యన్నపాత్రుడుతో పాటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అల్లూరి తన కుటుంబం కంటే దేశ సేవ గొప్పదిగా బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసి చిన్న వయస్సులో స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. యువత డ్రగ్స్, గంజాయి బారిన పడి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పో తున్నారని, వీటి నిర్మూలనకు ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ అల్లూరి చరిత్ర ఎంతో మంది యువతకు అదర్శమన్నారు. అల్లూరికి యుద్ధ విద్య, మూలికల వైద్యం, గెరిల్లా పోరాటంలో నైపుణ్యం, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ అల్లూరి ప్రధాన అనుచరులు గంటందొర, మల్లు దొర కుటుంబీకులకు క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో గృహ నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత ఎన్‌సీసీ విద్యార్థులకు హైస్కూల్‌లో ఎన్‌సీసీ క్యాంపు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడికి ఆయన వినతిపత్రం అందజేశారు. అలాగే పార్కులో చదువుకునే నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమైన మెటీరీయల్ అందించాలని వేపాడ చిరంజీవిరావు కోరగా, త్వరలో అందిస్తామని అయ్యన్న తెలిపారు. పాడుతా తీయగా విన్నర్ ధీరజ్ ఈ సందర్భంగా మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం పాట పాడారు. పార్కులో విద్యార్థులు, కళాకారులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం బదిలీపై వెళుతున్న కలెక్టర్ రవి పట్టన్‌శెట్టిని అయ్యన్నపాత్రుడు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డీపీవో శిరీషారాణి, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి వి.నాగశిరీషా, ఆర్‌డీవో జయరాం, జిల్లా అటవీఅధికారి లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, మాజీ జడ్పీటీసీ చిటికెల తారకవేణుగోపాల్, టీడీపీ మండలాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, ఎంపీటీసీ రామకృష్ణ, చోద్యంసర్పంచ్ అదపురెడ్డి గోపాలకృష్ణ, జనసేన నాయకుడు రాజాన సూర్యచంద్ర, తదితరులు పాల్గొన్నారు.