రూ.కోట్ల విలువైన ఆలయ భూముల కబ్జాకు యత్నం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:02 AM
అనకాపల్లి నడిబొడ్డున పూల్‌బాగ్ పరిసరాల్లో రూ.కోట్లు విలువ చేసే దేవాదాయ శాఖకు చెందిన భూముల ఆక్రమణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు ప్రయత్నించారు. శనివారం దేవదాయశాఖ గతంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి భూ కబ్జాకు యత్నించారు. అధికారులకు ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి ఆక్రమణదారులను అడ్డుకున్నారు.

- హెచ్చరిక బోర్డు తొలగింపు
- అడ్డుకున్న దేవదాయ శాఖాధికారులు
- ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు
అనకాపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నడిబొడ్డున పూల్‌బాగ్ పరిసరాల్లో రూ.కోట్లు విలువ చేసే దేవాదాయ శాఖకు చెందిన భూముల ఆక్రమణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు ప్రయత్నించారు. శనివారం దేవదాయశాఖ గతంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి భూ కబ్జాకు యత్నించారు. అధికారులకు ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి ఆక్రమణదారులను అడ్డుకున్నారు.
అనకాపల్లి ఆర్డీసీ కాంప్టెక్స్‌కు సమీపంలోని పూల్‌బాగ్ ప్రాంతంలో విశాఖపట్నం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం (అంబికాబాగ్)కు చెందిన సర్వే నంబరు 66 (టీడీ నంబరు 3274)లో సుమారు 29.71 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ ఆ భూములు తమవిగా చెప్పుకొని అనకాపల్లికి చెందిన కొణతాల రజని, బొడ్డేడ శ్రీనివాసరావులు మరికొందరుతో కలిసి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అప్పట్లో తీవ్రంగా ప్రతిఘటించిన దేవదాయ శాఖాధికారులు కోర్టును ఆశ్రయించారు. 2022 సెప్టెంబరులో సీసీఎల్‌ఏ కోర్టు, ఆర్‌డీవో కోర్టులో పూల్‌బాగ్‌లోని ఆ భూములు విశాఖపట్నం శ్రీసీతారామచంద్రస్వామికి చెందినవిగా తీర్పు వచ్చింది. అప్పట్లోనే దేవదాయ శాఖ అధికారులు స్థలం వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. నాటి నుంచి స్థలం వద్ద కోర్టు సూచనల మేరకు ప్రైవేటు రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.
మళ్లీ అదే బరితెగింపు
అధికార పార్టీ అనుచరులుగా చెప్పుకొంటున్న కొందరు శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎక్స్‌కవేటర్‌తో వచ్చి దేవదాయ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొనే ప్రయత్నం చేసినా తమకు కోర్డు స్టేటస్కో ఉత్తర్వులు ఇచ్చిందని బుకాయించారు. విషయం తెలిసి దేవదాయశాఖ అధికారులు అక్కడికి వచ్చి స్టేటస్కో ఉత్తర్వులు చూపించాలని ఆక్రమణదారులను నిలదీశారు. ఇంతలో మీడియా ప్రతినిధులు అక్కడికి రావడంతో ఆక్రమణదారులు జారుకున్నారు. ఈ సంఘటనపై దేవదాయ శాఖ ఏఈవో రాంబాబు, ఏఈ సూర్యనారాయణలు అనకాపల్లి డీఎస్‌పీ అప్పలరాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్‌పీ అప్పలరాజు మాట్లాడుతూ భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున దేవదాయ శాఖ ఉద్యోగుల ఫిర్యాదును పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. ఈ భూములను సీపీఎం నేత లోకనాథం, జిల్లా కమిటీ సభ్యులు శంకరరావు, శ్రీరామ్, శ్రీనివాసరావు పరిశీలించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.