Share News

కూటమి ఎంపీ అభ్యర్థి ఖరారు

ABN , Publish Date - Mar 25 , 2024 | 01:17 AM

అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఈ నియోజకవర్గం నుంచి రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ నేత సీఎం రమేశ్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ పేరును ప్రకటించింది.

కూటమి ఎంపీ అభ్యర్థి ఖరారు
సీఎం రమేశ్‌, బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి

అనకాపల్లికి సీఎం రమేశ్‌ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి

అనకాపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఈ నియోజకవర్గం నుంచి రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ నేత సీఎం రమేశ్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ పేరును ప్రకటించింది.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా (ఎన్‌డీఏ) ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు వుండగా... టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరకముందు ఎంపీ సీటుతోపాటు రెండు అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ, మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని భావించాయి. అయితే టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ జట్టు కట్టడంతో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని బీజేపీకి విడిచిపెట్టారు. అసెంబ్లీ స్థానాల్లో మార్పులేదు. నాలుగుచోట్ల టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల తరపున ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. రాష్ట్రానికి సంబంధించి బీజేపీ శనివారం వరకు ఒక్క జాబితాలను కూడా విడుదల చేయకపోవడంతో అనకాపల్లి ఎంపీ టికెట్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందన్న దానిపైఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇంకా ఒకటి, రెండు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సీఎం రమేశ్‌ పేరునే అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కూటమి తరపు పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్పష్టత వచ్చేసింది.

టీడీపీతో రాజకీయ ప్రస్థానం

కడప జిల్లా పోట్లదుర్తి గ్రామంలో మునిస్వామినాయుడు, రత్నమ్మ దంపతులకు 1965 జూన్‌ 12న సీఎం రమేశ్‌ జన్మించారు. ఆయనకు భార్య సీఆర్‌ శ్రీదేవి, కుమారుడు రిత్విక్‌, కుమార్తె రిత్విన్‌ ఉన్నారు. రిత్విక్‌ ప్రాజెక్ట్సు పేరుతో వ్యాపార రంగంలో ఉన్న సీఎం రమేశ్‌.. 1997లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపునందుకొని టీడీపీలో చేరారు. టీడీపీ చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా పని చేశారు. తరువాత టీడీపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ తరపున 2012లో రాజ్యసభ సభ్యుడి ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరం కడప జిల్లాలో విద్యుత్‌ కోతలు, సాగునీరు, తాగునీరు సమస్యలు, సిమెంట్‌ ధర తగ్గించాలని కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. 2018లో రెండోసారి టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గత సాధారణ ఎన్నికల తరువాత సహచర రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌తో కలిసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడి పనిచేశారు.

పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ స్థానం బీజేపీకే కేటాయించడంతో సీఎం రమేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం రమేశ్‌కు ఇదే తొలిసారి.

అరకులోయ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత

పాడేరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరు బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జాబితాను విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి గీత పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. గ్రూప్‌-1 అధికారిగా సేవలందించారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడంతో 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అరకులోయ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018లో వైసీపీ అధిష్ఠానంతో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. 2019లో బీజేపీలో విలీనం చేశారు. గత ఏడాది ఆగస్టులో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పొత్తులో భాగంగా అరకులోయ ఎంపీ సీటును బీజేపీకి కేటాయించడంతో కొత్తపల్లి గీత అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.

మరో రెండు సీట్లకు

జనసేన అభ్యర్థులు ఖరారు

పెందుర్తికి పంచకర్ల, ఎలమంచిలికి సుందరపు

అనకాపల్లికి కొణతాల రామకృష్ణ పేరును గతంలోనే ప్రకటించిన అధిష్ఠానం

పెండింగ్‌లో విశాఖ దక్షిణ నియోజకవర్గం

విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పొత్తులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి కేటాయించిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటించింది. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ పేరును మొదటి జాబితాలోనే వెల్లడించగా, తాజాగా విడుదల చేసిన మరో జాబితాలో పెందుర్తి నుంచి పంచకర్ల రమేశ్‌బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌లకు చోటు దక్కింది. విశాఖ దక్షిణం సీటును పెండింగ్‌లో పెట్టారు.

తొలుత టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని జనసేన పార్టీ టీడీపీని కోరింది. పెందుర్తి, భీమిలి, గాజువాక, ఎలమంచిలి స్థానాలను అడిగినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తమ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలను విడుదల చేశారు. అనూహ్యంగా అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ పేరును ప్రకటించారు. కొద్ది రోజుల తరువాత కూటమిలో బీజేపీ చేరడంతో సమీకరణాలు మారిపోయాయి. పెందుర్తి, ఎలమంచిలితోపాటు విశాఖ దక్షిణ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌.. పెందుర్తికి పంచకర్ల రమేశ్‌బాబు, ఎలమంచిలికి సుందరపు విజయకుమార్‌ పేర్లను ఖరారు చేసి, ఎన్నికల ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్‌పై వంశీకృష్ణ శ్రీనివాస్‌కు కూడా హామీ లభించింది. అయితే ఆదివారం ప్రకటించిన మలివిడత జాబితాలో పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి), సుందరపు విజయకుమార్‌ (ఎలమంచిలి)కు మాత్రమే చోటు లభించింది. దక్షిణ నియోజకవర్గం ప్రస్తావనలేకపోవడంతో వంశీకృష్ణతోపాటు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పంచకర్ల రమేశ్‌ బాబు

నగరంలో వ్యాపారం చేసుకునే పంచకర్ల రమేష్‌బాబు ప్రజారాజ్యం ఏర్పాటుతో రాజకీయాల్లో ప్రవేశించి 2009లో పెందుర్తి నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి విజయం సాఽధించారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత వైసీపీలో చేరి పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ ఇమడలేక జనసేనలో చేరారు. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంలో భాగంగా జనసేన పార్టీకి పెందుర్తి కేటాయించడంతో పంచకర్లకు అవకాశం లభించింది.

సుందరపు విజయకుమార్‌

ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన సుందరపు విజయకుమార్‌ తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో ఎలమంచిలి నుంచి పోటీచేసే అవకాశం చివర్లో చేజారింది. తరువాత కొన్నాళ్లకు జనసేనలో చేరి 2019లో ఎలమంచిలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పవన్‌కల్యాణ్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అదే స్థానం నుంచి టికెట్‌ ఖరారైంది.

Updated Date - Mar 25 , 2024 | 01:17 AM