Share News

కూటమి క్లీన్‌స్వీప్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:42 AM

విశాఖపట్నం జిల్లాలో కూటమి దుమ్ము రేపింది.

కూటమి క్లీన్‌స్వీప్‌

జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ కైవసం

నాలుగు సెగ్మెంట్లలో టీడీపీ, రెండుచోట్ల జనసేన, ఒకచోట బీజేపీ అభ్యర్థుల ఘన విజయం

మూడు దశాబ్దాల అనంతరం పూర్తిస్థాయి పట్టు సాధించిన టీడీపీ

వైసీపీకి ఊహించని షాక్‌

(అనకాపల్లి/విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లాలో కూటమి దుమ్ము రేపింది. మొత్తం క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగింటిలో తెలుగుదేశం పార్టీ, రెండింటిలో జనసేన, ఒకచోట బీజేపీ పోటీ చేశాయి. అన్నిచోట్ల కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అధికార పార్టీ వైసీపీ బొక్క బోర్లా పడింది.

రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన భీమిలిలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు భారీ మెజారిటీతో విజయం సాఽధించారు. గంటా శ్రీనివాసరావుకు 1,47,081 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు 71,736 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్డాల వెంకటరామరాజు 4,297 ఓట్లు వచ్చాయి. గంటా శ్రీనివాసరావుకు 92,401 ఓట్ల మెజారిటీ లభించింది.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. వెలగపూడికి 1,29,185 ఓట్లు, సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 59,774 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి గుత్తల శ్రీనివాస్‌కు 3,363 ఓట్లు వచ్చాయి. రామకృష్ణబాబుకు 70,877 ఓట్ల ఆధిక్యం లభించింది.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌కు 97,868 ఓట్లు, సమీప ప్రత్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్ధి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు 33,274 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి వాసుపల్లి సంతోష్‌కుమార్‌కు 3,940 ఓట్లు వచ్చాయి. వంశీకృష్ణకు 64,594 ఓట్ల మెజారిటీ వచ్చింది.

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజుకు 1,05,278 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కేకే. రాజుకు 59,174 ఓట్లు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు 4,558 ఓట్లు వచ్చాయి. విష్ణుకుమార్‌రాజు 47,534 మెజారిటీతో కేకే రాజుపై విజయం సాధించారు.

విశాఖ పశ్చిమలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి.గణబాబుకు 90,805 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనందకుమార్‌కు 55,621 ఓట్లు రాగా నోటాకు 1002 ఓట్లు వచ్చాయి. గణబాబు 35,184 మెజారిటీతో హ్యాట్రిక్‌ విజయం సాధించారు.

గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 1,55,587 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌కు 61,529 ఓట్లు, సీపీఎం అభ్యర్ధి మరడాన జగ్గునాయుడుకు 3,831 ఓట్లు వచ్చాయి. పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు 1,41,859 ఓట్లు రాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు 64,671 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి భగత్‌కు 3,960 ఓట్లు వచ్చాయి. పంచకర్లకు 77,188 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. కాగా పంచకర్ల మెజారిటీ కంటే వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌కు వచ్చిన ఓట్లు తక్కువ కావడం విశేషం.

కూటమిలో ఫుల్‌ జోష్‌

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూటమి అభ్యర్థుల్లో పుల్‌ జోష్‌ను నింపాయి. అంచనాలకు అందనంత ఘన విజయం లభించడంతో నేతలు ఊబ్బితబ్బివుతున్నారు. అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇన్ని స్థానాలు వస్తాయని, విశాఖలో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఊహించలేదంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఓటమి ఎదురైనా విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీకి నగరంలో పటిష్ట నాయకత్వం, కేడర్‌ ఉంది. దీనికి తోడు జనసేన, బీజేపీల పొత్తుతో వైసీపీని పూర్తిగా ఊడ్చి పారేసింది.

చతికిలబడిన వైసీపీ

జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలోని 1,991 పోలింగ్‌ బూత్‌లలోనూ వైసీపీ కనీసం ఒక్క రౌండ్‌లో కూడా మెజారిటీ సాధించలేకపోయింది. గత నెలలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తరువాత వైసీపీ జిల్లాలో ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో అనుకూల ఫలితాలు వస్తాయని భావించింది. అయితే మంగళవారం ఉదయం చేపట్టిన ఓట్ల లెక్కిపులో ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ నేతలు మంచి మెజారిటీలను సాధించడంతో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. భీమిలి నుంచి గాజువాక వరకు అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన 1983, 85 తరువాత 1994లో విశాఖలో టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేయగా, దాదాపు 30 ఏళ్ల తరువాత జిల్లాలో టీడీపీ పూర్తిస్థాయి పట్టు సాధించగలిగింది.

Updated Date - Jun 05 , 2024 | 01:42 AM