Share News

జిల్లాలో కూటమి క్లీన్‌ స్వీప్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:40 AM

అనకాపల్లి జిల్లాలో కూటమి దుమ్ము రేపింది. మొత్తం క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. అనకాపల్లి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, రెండింటిలో జనసేన నాయకులు పోటీ చేశారు. అన్నిచోట్ల వారే మంచి మెజారిటీతో విజయం సాధించారు. అధికార పార్టీ వైసీపీ బొక్క బోర్లా పడింది.

జిల్లాలో కూటమి క్లీన్‌ స్వీప్‌
కేక్‌ కట్‌ చేస్తున్న సీఎం రమేశ్‌

- జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలూ కైవసం

- నాలుగు స్థానాల్లో టీడీపీ, రెండు సెగ్మెంట్లలో జనసేన అభ్యర్థుల ఘన విజయం

- బొక్క బోర్లాపడిన వైసీపీ

(అనకాపల్లి/విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి జిల్లాలో కూటమి దుమ్ము రేపింది. మొత్తం క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. అనకాపల్లి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, రెండింటిలో జనసేన నాయకులు పోటీ చేశారు. అన్నిచోట్ల వారే మంచి మెజారిటీతో విజయం సాధించారు. అధికార పార్టీ వైసీపీ బొక్క బోర్లా పడింది.

అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి సీనియర్‌ నాయకులు కొణతాల రామకృష్ణ జనసేన నుంచి బరిలో నిలవగా వైసీపీ నుంచి మలసాల భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి ఐఆర్‌ గంగాధర్‌ ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇక్కడ మొత్తం 1,70,582 .ఓట్లు పోలవ్వగా అందులో కొణతాల రామకృష్ణకు 1,15,126 ఓట్లు లభించాయి. వైసీపీకి 49,362 రాగా, కొణతాల రామకృష్ణ 65,764 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గంగాధర్‌కు కేవలం 1,835 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వైసీపీ అభ్యర్థికి లభించిన ఓట్ల కంటే కొణతాలకు ఎక్కువ మెజారిటీ వచ్చింది.

- ఎలమంచిలి నియోజకవర్గంలో జనసేన నుంచి సుందరపు విజయకుమార్‌, వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కన్నబాబురాజు, కాంగ్రెస్‌ నుంచి ఏఆర్‌ నరసింగరావులు పోటీ చేశారు. ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు 1,77,376 కాగా సుందరపు విజయకుమార్‌కు 1,09,443 ఓట్లు లభించగా, కన్నబాబురాజుకు 60,487 ఓట్లు వచ్చాయి. విజయకుమార్‌ 48,956 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 1,800 ఓట్లు లభించాయి. సుందరపు విజయకుమార్‌ గతంలోను జనసేన తరఫున పోటీ చేసి 19 వేల పైచిలుకు ఓట్లను సాధించారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బరిలో నిలవడంతో టీడీపీ, బీజేపీ ఓట్లు కలిసి లక్షకు పైగా సాధించారు.

చోడవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధర్మశ్రీ, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, కాంగ్రెస్‌ నుంచి జె.శ్రీనివాసరావు ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు. ఇక్కడ 1,84,026 ఓట్లు పోలవ్వగా...కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు 1,09,651 ఓట్లు సాధించి, సమీప అభ్యర్థి ధర్మశ్రీపై 42,189 ఓట్ల మెజారిటీ సాధించారు. ధర్మశ్రీకి 67,462 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌కు 2,527 ఓట్లు లభించాయి.

మాడుగుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో ఖరారైన బండారు సత్యనారాయణమూర్తి 28,026 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ పోటీ చేయగా, కాంగ్రెస్‌ నుంచి బి.శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 1,62,580 ఓట్లు పోలవ్వగా, బండారుకు 91,869 ఓట్లు, అనురాధకు 63,843 ఓట్లు, శ్రీనివాసరావుకు 1,760 ఓట్లు లభించాయి.

పాయకరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత రెండోసారి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై ఆమె 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ 2,06,626 ఓట్లు పోలవ్వగా...అనితకు 1,20,042 ఓట్లు లభించగా, వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుకు 76,315, కాంగ్రెస్‌ అభ్యర్థి బోని తాతారావుకు 2,087 ఓట్లు దక్కాయి.

నర్సీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌పై 24,676 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ 1,79,852 ఓట్లు పోలవ్వగా...అయ్యన్నకు 99,849 ఓట్లు లభించగా, ఉమాశంకర్‌గణేశ్‌కు 75,173 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి బి.నాగరాజుకు 1,226 ఓట్లు వచ్చాయి.

పెందుర్తి నియోజకవర్గం (ఈ నియోజకవర్గంలో పెందుర్తి విశాఖ జిల్లాలో ఉండగా, పరవాడ, సబ్బవరం మండలాలు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి) నుంచి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు 77,188 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన గతంలో ఒకసారి ప్రజారాజ్యం అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత టీడీపీ అభ్యర్థిగా ఎలమంచిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు. మొత్తం 2,28,938 ఓట్లు పోలవ్వగా...పంచకర్లకు 1,41,859 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అయిన సిటింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు 64,671 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పిరిడి భగత్‌కు 3,960 ఓట్లు లభించాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే జనసేనకు వచ్చిన మెజారిటీయే అధికంగా ఉండడం విశేషం.

Updated Date - Jun 05 , 2024 | 01:40 AM