Share News

ఆ మూడూ జగన్‌ కోసం...

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:26 AM

రుషికొండపై రాజమహల్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. ఏడు భవనాల్లో మూడు ప్రత్యేకంగా జగన్‌ కుటుంబం కోసమే తీర్చిదిద్దారు.

ఆ మూడూ  జగన్‌ కోసం...

ఒక భవంతి జగన్‌ దంపతుల కోసం, మరో రెండు కుమార్తెలకు...

వాటికి మాత్రమే సీ వ్యూ

బాత్‌రూమ్‌ టబ్‌ ఒక్కొక్కటి రూ.26 లక్షలు?

స్పెషల్‌గా స్పా రూమ్‌

అన్యులకు ప్రవేశం లేకుండా పెద్ద గేటు ఏర్పాటు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రుషికొండపై రాజమహల్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. ఏడు భవనాల్లో మూడు ప్రత్యేకంగా జగన్‌ కుటుంబం కోసమే తీర్చిదిద్దారు. అక్కడ ఈ మూడింటికి మాత్రమే సీ వ్యూ ఉంది. మిగిలిన వాటికి ఎదురుగా బీచ్‌రోడ్డు, గీతం కాలేజీ కనిపిస్తాయి. జగన్‌ కుటుంబం కోసం నిర్మించిన భవనాల్లో బాల్కనీలోకి వచ్చినా, బాత్‌రూమ్‌లో నుంచైనా కిటికీల నుంచి సముద్రం కనిపిస్తుంది. అలా డిజైన్‌ చేసుకున్నారు. అలాగే మసాజ్‌ కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకున్నారు. దానికి ‘స్పా రూమ్‌’ అని పేరు పెట్టుకున్నారు. ఇవన్నీ గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ నిర్మాణాలు. విజయనగర-1 భవనం జగన్‌, భారతీల కోసం నిర్మించారు. అందులో నాలుగు పడక గదులు ఉన్నాయి. మిగిలిన రెండు భవనాలు చెరో కుమార్తె కోసం ఉద్దేశించినవి. వాటిలో కూడా నాలుగేసి పడక గదులు, విశాలమైన సమావేశ మందిరాలు ఉన్నాయి. ఈ మూడు భవనాలను, మిగిలిన నాలుగింటికి దూరంగా సముద్రానికి అభిముఖంగా నిర్మించారు. వీటికి ప్రత్యేకంగా పెద్దగేటు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరికీ అటువైపు ప్రవేశం లేకుండా చేశారు. పిడుగులు పడినా చెక్కు చెదరకుండా ఏర్పాట్లు ఉన్నాయి. వీటిలో బాత్‌రూమ్‌ టబ్‌ ఒక్కొక్కటి రూ.26 లక్షలని చెబుతున్నారు. ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ టోటో కంపెనీకి చెందిన బాత్‌రూమ్‌ ఫిటింగ్స్‌ వినియోగించారు. ఇలాంటివన్నీ పర్యాటకుల కోసమేనా?...అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తే...సమాధానం చెప్పకుండా అవి ప్రభుత్వ భవనాలే కదా? అంటున్నారు తప్పితే..అంత ఖర్చు ఎందుకు చేశారో చెప్పడం లేదు.

Updated Date - Jun 18 , 2024 | 01:26 AM