Share News

కోల్‌ యార్డులన్నీ ఖాళీ..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:15 AM

అసలే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌.. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తికి విలవిల్లాడుతోంది.

కోల్‌ యార్డులన్నీ ఖాళీ..!

స్టీల్‌ప్లాంటులో గత 33 ఏళ్లలో ఇదే తొలిసారి

ప్లాంటులో ఉక్కు ఉత్పత్తికి తీవ్ర విఘాతం

గంగవరం పోర్టులో ఆగిన 3.09లక్షల టన్నుల కోల్‌

కార్మికుల సమ్మెతో ఉక్కు కర్మాగారానికి చేరని వైనం

స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

నెలకు 360 కోట్లు పన్నులు కడుతున్నా చులకనే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అసలే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌.. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తికి విలవిల్లాడుతోంది. అదానీ గంగవరం పోర్టులో 12 రోజులుగా జరుగుతున్న సమ్మె వల్ల కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా రావలసిన ముడి పదార్థాలన్నీ ఆగిపోవడంతో స్టీల్‌ప్లాంటులోని కోల్‌ యార్డులన్నీ ఖాళీ అయిపోయాయి. ఆర్థిక వనరులకు ఇబ్బంది పడుతున్న స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఉద్యోగులకు జీతాలు ఆపి మరీ ఆస్ట్రేలియా నుంచి మూడు దఫాలుగా నౌకల ద్వారా కోల్‌ను దిగుమతి చేసుకుంది. అయితే 3.09 లక్షల టన్నుల కోల్‌, మరో 60 వేల టన్నుల డోలమైట్‌ గంగవరం పోర్టులోనే ఉండిపోయింది. వాటిని కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా స్టీల్‌ప్లాంటుకు పంపాల్సి ఉండగా, పోర్టులో కార్మికుల సమ్మె ఫలితంగా ఆ నిల్వలు అక్కడే ఉండిపోయాయి. దాంతో ప్లాంటులో ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇప్పటికిప్పుడు డబ్బులు పెట్టి బహిరంగ మార్కెట్‌లో అవసరమైనవి సమకూర్చుకునే శక్తి లేకపోవడంతో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్‌, ఎన్‌ఎండీసీలను అభ్యర్థించి 8వేల టన్నుల కోల్‌ను సమకూర్చుకుంది. మరో రెండు నౌకల ద్వారా 75 వేల టన్నుల చొప్పున బొగ్గు విదేశాల నుంచి రాగా ఆ నౌకలను గంగవరం నుంచి విశాఖ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి ర్యాక్‌లు, రోడ్డు మార్గాన తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.

యథాస్థితికి రావాలని కోరుతూ చండీయాగం

స్టీల్‌ప్లాంటులో బొగ్గును నిల్వ చేసుకోవడానికి, వచ్చిన బొగ్గును వివిధ విభాగాలకు తరలించడానికి యాభై ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది కోల్‌ యార్డులు, భారీ క్రేన్లు ఉన్నాయి. ఆ యార్డులు బొగ్గు కుప్పలతో నిండిపోయి, క్రేన్‌ ఆపరేషన్లతో నిత్యం సందడిగా ఉండేవి. అలాంటి ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. యార్డుల్లో కింద మట్టి కనపడేలా బొగ్గును ఊడ్చేసి మరీ వాడుతున్నారు. గత 35 ఏళ్లలో ఏనాడూ ఇలా ఖాళీ యార్డులు చూడలేదని ఉద్యోగులు, కార్మికులు చెబుతున్నారు. ప్లాంటు యథాస్థితికి రావాలని కోరుతూ కార్మిక సంఘాలు సోమవారం ఇక్కడ చండీయాగం నిర్వహించాయి. ఇలాంటి పూజలు చేయడం కూడా ఇదే తొలిసారి.

ప్రతి వేయి కోట్లలో రూ.180 కోట్ల పన్నులు

స్టీల్‌ ప్లాంటు ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.25 వేల కోట్లకు పైగానే టర్నోవర్‌ చేస్తుంది. సగటున నెలకు ఎంత లేదన్నా రూ.2 వేల కోట్ల ఉత్పత్తులు విక్రయిస్తుంది. ఇలా అమ్మిన ప్రతి వేయి కోట్లపై కేంద్రానికి 9 శాతం, రాషా్ట్రనికి 9 శాతం చొప్పున రూ.180కోట్లు జీఎస్‌టీగా చెల్లిస్తుంది. నెలకు రూ.2 వేల కోట్ల అమ్మకాలపై 18 శాతం చొప్పున రూ.360 కోట్లు పన్ను చెల్లిస్తోంది. ఇంత ఆదాయం సమకూర్చే సంస్థ రెండు వారాలుగా ముడి సరుకు లేక ఇబ్బంది పడుతుంటే అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించడం లేదు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకుండా చోద్యం చేస్తున్నాయి.

తక్షణమే ముందుకు రావాలి: అయోధ్యరామ్‌

ఇది అదానీ గంగవరం పోర్టు, విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులకు సంబంధించిన సమస్య కాదని, ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది సమస్య అని ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ అన్నారు. ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ముందుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషిచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 23 , 2024 | 02:15 AM