Share News

అందరినీ కలుపుకొని వెళతా...

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:48 AM

అందరినీ కలుపుకొని పోతూ పరవాడ, పెందుర్తి నియోజకవర్గాలకన్నా మాడుగుల నియోజకవర్గాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి స్పష్టం చేశారు.

అందరినీ కలుపుకొని వెళతా...
టీడీపీ శ్రేణులతో భారీ ర్యాలీగా వస్తున్న బండారు, గవిరెడ్డి, పీవీజీ, తదితరులు

మాడుగులను పెందుర్తి, పరవాడ కన్నా అభివృద్ధి చేస్తా..

ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం చేసుకోమని చంద్రబాబు పంపారు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వెల్లడి

ముకుందపురం నుంచి బైక్‌ ర్యాలీగా మోదకొండమ్మ ఆలయానికి చేరి పూజలు

మాడుగుల, ఏప్రిల్‌ 18 : అందరినీ కలుపుకొని పోతూ పరవాడ, పెందుర్తి నియోజకవర్గాలకన్నా మాడుగుల నియోజకవర్గాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ ఆధ్వర్యంలో మండలంలోని ముకుందపురం గ్రామం నుంచి ఎనిమిది కి.మీ.మేర నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి గురువారం ఆయన భారీ ర్యాలీగా మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బండారు దంపతులతో పాటు గవిరెడ్డి, పీవీజీలకు ఆలయ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. అమ్మవారికి బండారు పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల ఆశీర్వచనాలను అందుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాడుగుల నుంచి తనను టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకోమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పంపించారని వివరించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పైలా ప్రసాదరావు స్థానంలో తనను ఇక్కడకు పంపించారని బండారు స్పష్టం చేశారు. మాడుగుల నియోకవర్గంలోని అలమండ, చీడికాడ తమ తాతగారి ఊర్లని, బాల్యంలో ఇక్కడే చదివానని వివరించారు. అందరితో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవనున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినా ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా నడిపించేది గవిరెడ్డి రామానాయుడేనని బండారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ సోదరుడు సురేష్‌నాయుడు, టీడీపీ అకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, పుప్పాల అప్పలరాజులతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:48 AM