Share News

వైసీపీకి ఎదురుగాలి

ABN , Publish Date - May 12 , 2024 | 01:30 AM

‘వైసీపీ పాలనలో ధరలు ఆకాశాన్ని అంటాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బతకడమే కష్టంగా మారింది.

వైసీపీకి ఎదురుగాలి

నగరవాసుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి

ఐదేళ్లుగా పనులు లేక అల్లాడిపోయామని భవన నిర్మాణ కార్మికుల ఆవేదన

జగన్‌ కనీసం సాయం చేయలేదంటూ ఆగ్రహం

నగరాన్ని ఐదేళ్ల నుంచి పట్టించుకోకుండా చివరిలో హడావిడిగా బస్టాపులు నిర్మించారన్న ఒక రిటైర్డు సివిల్‌ ఇంజనీర్‌

వాటిల్లోనూ నాణ్యత లేదని పెదవివిరుపు

ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టడమేమిటని ప్రశ్నించిన ఓ కాంట్రాక్టర్‌

పాలనా రాజధాని చేస్తానన్న జగన్‌...నగరానికి తెచ్చిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పాలన్న ఐటీ ఉద్యోగి

తమకు ఇచ్చిన దానికంటే తీసుకున్నదే ఎక్కువన్న ఆటో డ్రైవర్‌

నిత్యావసర ధరల పెరుగుదలపై మహిళల ఆందోళన

వేతనంలో పది శాతం బస్‌ చార్జీలకే పోతోందని మరో యువతి ఆవేదన

జగన్‌ సర్కారు చేసినంత అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్న ఓ నిరుద్యోగి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘వైసీపీ పాలనలో ధరలు ఆకాశాన్ని అంటాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బతకడమే కష్టంగా మారింది. కరెంట్‌, బస్‌ చార్జీలు, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో మాపై నెలకు రూ.6 వేలకుపైగా అదనపు భారం పడింది.’

- ఆర్‌.శ్యామల, గృహిణి, పిఠాపురం కాలనీ

‘‘నిరుద్యోగులకు జగన్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. నాకు తెలిసి ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయకుండా ఐదేళ్లు పూర్తిచేసిన ఘనత వైసీపీ సర్కారుకే దక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు జగన్‌కు తగలకపోదు. నిరుద్యోగులు దెబ్బ ఎలా ఉంటుందో జగన్‌ ఈ ఎన్నికల్లో చూస్తారు.’’

- టి.సూర్యచంద్ర, నిరుద్యోగి, మద్దిలపాలెం

‘‘జగన్‌కు ఉన్న అనుభవ రాహిత్యం ఐదేళ్లలో స్పష్టంగా కనిపించింది. ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలుంటే వాటిని సరిచేసి పాలన సాగించాలి. అంతేకానీ, ఆ నిర్ణయాలను ఐదేళ్లపాటు తప్పుబడుతూ ముందుకువెళ్లడం వల్ల ఫలితం ఉండదు. జగన్‌ విషయంలో ఇదే జరిగింది. చంద్రబాబు నిర్ణయాలను ఇప్పటికీ తప్పుబట్టడం వల్ల ఫలితం ఉండదు. జగన్‌ చేసిన కొన్ని పనులు బాగానే ఉన్నప్పటికీ...ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేశారు. బటన్‌ నొక్కుడు పథకాలతో ఎమ్మెల్యేలు, ఎంపీలను డమ్మీ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ర్టానికి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు కావాలి. కేంద్రంలో మరోమారు నరేంద్రమోదీ రావాలి’’

- ఎం.సూర్యనారాయణస్వామి, సీనియర్‌ సిటిజన్‌, ఎంవీపీ కాలనీ

పోలింగ్‌కు మరికొద్ది గంటలు సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో నగర ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నాన్ని ‘ఆంధ్రజ్యోతి’ చేసింది. నగరంలో అనేక ప్రాంతాలను సందర్శించింది. అయితే అధికార పార్టీపై అనేక వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత సుస్పష్టంగా కనిపించింది. అధికార పార్టీపై ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకతను చూడడం ఇదే తొలిసారి అని ఏయూలో పనిచేసిన ఓ రిటైర్డ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ పేర్కొనడం గమనార్హం.

అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత

గడిచిన ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిన వారిలో భవన నిర్మాణ కార్మికులు ముందున్నారు. అటువంటివారు ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు. గడిచిన ఐదేళ్లలో తమకు రూపాయి సాయం చేయలేదని, పై పెచ్చు తమకు చెందిన వెల్ఫేర్‌ బోర్డు నిధులను ఇతర పథకాలకు మళ్లించాడంటూ తాపీమేస్ర్తీగా పనిచేస్తున్న రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక కొరతతో పనులు దొరకని పరిస్థితిలో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని రోజువారీ కూలీగా వెళుతున్న లక్ష్మి వాపోయింది. జగన్‌ మరోసారి అధికారంలోకి వస్తే తమకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనను వెంకోజీపాలెంలో ఉంటున్న రాడ్‌ బెండర్‌ శివయ్య వ్యక్తం చేశాడు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో విశాఖ నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మరికొందరు ఆరోపించారు. ఐదేళ్లలో విశాఖను పట్టించుకోకుండా...ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో సిటీలో హడావిడిగా పనులు చేశారని, వీటిలో నాణ్యత లోపించిందని ఒక రిటైర్డ్‌ సివిల్‌ ఇంజనీర్‌ పేర్కొన్నారు. నగర పరిధిలో ఏర్పాటుచేసిన అనేక బస్టాపుల్లో ఈ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను జగన్‌ ప్రభుత్వం తనఖా పెట్టిందని, ఇది అత్యంత దారుణమని రాజేశ్వరరావు అనే కాంట్రాక్టర్‌ వాపోయారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు కాపలాదారుగా ఉండాలని, అటువంటిది వారే ఆస్తులను తనఖా పెట్టడమేమిటని విమర్శించారు. విశాఖను పాలనా రాజధానిగా చేస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి...గడిచిన ఐదేళ్లలో నగరానికి తెచ్చిన కీలక ప్రాజెక్టులు గురించి చెప్పాలని ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న జశ్వంత్‌ డిమాండ్‌ చేశారు. ఐటీ పరిశ్రమ విశాఖలో పూర్తిగా డీలా పడిందని, దీనివల్ల ఉద్యోగాలకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గడిచిన ఐదేళ్లలో రోడ్లను కనీసం పట్టించుకోలేదని, దీనివల్ల వాహనాలు పూర్తిగా పాడయ్యాయని ఆటో డ్రైవర్‌ రాజు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.పది వేలు ఇస్తున్నానని చెప్పుకుంటున్నారని...ఫైన్లు, ఇతరత్రా రూపేణా అంతకు నాలుగింతలు తమ నుంచి వసూలు చేసుకున్నారని ఆరోపించాడు.

గడిచిన ఐదేళ్లలో నిరుద్యోగులకు అవకాశాలు పూర్తిగా అడుగంటిపోయాయని, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కూడా దొరకడం లేదని కార్తీక్‌ అనే యువకుడు పేర్కొన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఐదేళ్లలో నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయాయని, చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకురావడం ఇబ్బందిగా మారిందని హెచ్‌బీ కాలనీకి చెందిన రాజేశ్వరి అనే గృహిణి పేర్కొన్నారు. బస్‌ చార్జీలు భారం ఐదేళ్లలో రెట్టింపు అయిందని, వేతనంలో పది శాతం చార్జీలకే సరిపోతోందని ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న రుక్ష్మిణి అనే యువతి పేర్కొంది. కూటమి ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం తమకు ఎంతో మేలు చేస్తుందని ఆమె తెలిపింది. నిరుద్యోగులకు జగన్‌ సర్కారు చేసినంత మోసం, అన్యాయం ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదని నాగరాజు అనే నిరుద్యోగి పేర్కొన్నాడు. గడిచిన ఏడేళ్ల నుంచి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నానని, ఒక్కసారి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు.

మద్యంతో ఆరోగ్యాన్ని పూర్తిగా గుల్ల చేశాడని, గతంలో ఎప్పుడూ చూడని, వినని మద్యాన్ని అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నాడని లారీడ్రైవర్‌గా చేసే గొల్లబాబు పేర్కొన్నారు. నిరుద్యోగులకు కూటమి అందిస్తానన్న నిరుద్యోగ భృతి అద్భుతంగా ఉందని, అందుకే కూటమికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన సురేష్‌ అనే యువకుడు పేర్కొన్నాడు. ఉచిత బస్సు పథకం, గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ, నెలకు రూ.1500 స్కీమ్‌తో మహిళలకు చంద్రబాబు ఆర్థిక భరోసా ఇస్తున్నారని, ఈసారి కూటమికి ఓటేస్తే మేలు జరుగుతుందని ఆరిలోవ ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారాన్ని అందిస్తే నిరుద్యోగులకు మేలు కలుగుతుందని, ఐటీ రంగానికి బూమ్‌ వస్తుందని ప్రముఖ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. వ్యాపారానికి ఊపు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని ఒక వస్త్ర వ్యాపారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు విజన్‌ ఉందని, ఐటీ, ఆర్థిక రాజధానిగా విశాఖ వెలుగొందాలంటూ కూటమికి అవకాశం కల్పించాలని ప్రముఖ ఐటీ సంస్థలో హెడ్‌గా పనిచేస్తున్న ఒకాయన పేర్కొన్నారు.

ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశారు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు కొంత మేలు చేసే ప్రయత్నం జగన్‌ చేశాడని రాజు అనే యువకుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ స్కూల్స్‌ను మార్చారని ప్రశంసించారు. అప్పులు చేస్తున్నాడని చెబుతున్న వారంతా..గత పాలకులు చేసిన అప్పులు గురించి కూడా చెప్పాలని, నిరుపేదలకు అండగా ఉండేందుకు జగన్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాడని అప్పలనాయుడు అనే ప్రైవేటు ఉద్యోగి పేర్కొన్నారు. ఐదేళ్లలో జగన్‌ పాలన బాగానే ఉందని, ఏ ప్రభుత్వం వచ్చినా ధరలు పెరగక తప్పదని రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. రోడ్లు విషయంలో మాత్రం జగన్‌ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, మిగిలిన అనేక పథకాలు విషయంలో మాత్రం పాలన మెరుగ్గానే ఉందని ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే సుభాష్‌ పేర్కొన్నారు. జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేశాడని ఆరిలోవ ప్రాంతానికి చెందిన రోజా అనే మహిళ వెల్లడించారు.

Updated Date - May 12 , 2024 | 01:30 AM