Share News

రాత్రి 9 తరువాతే...

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:26 AM

జిల్లాలో గల ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ఈనెల నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టరు ఎ.మల్లికార్జున తెలిపారు.

రాత్రి 9 తరువాతే...

అధికారికంగా ఫలితాల వెల్లడి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున

ఏయూలోని 21 హాళ్లలో కౌంటింగ్‌

ఏర్పాట్లు పూర్తి

పార్లమెంటుకు 104, అసెంబ్లీ సెగ్మెంట్లకు 98, పోస్టల్‌ బ్యాలెట్లకు 51 టేబుళ్లు

హాలు నుంచి ఒకసారి ఏజెంట్‌ బయటకు వెళితే తిరిగి అనుమతించం

ఏజెంట్లు సెల్‌ఫోన్లు తీసుకురావద్దు

ఎలక్ర్టానిక్‌ పరికరాలను కూడా అనుమతించేది లేదని వెల్లడి

ఆరో తేదీ వరకూ ఎన్నికల కోడ్‌ ప్రతి ఒక్కరూ పాటించాలి

రెడ్‌ జోన్‌గా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణం: సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు

విశాఖపట్నం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో గల ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ఈనెల నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టరు ఎ.మల్లికార్జున తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు త్వరితగతిన పూర్తయినా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు కొంత సమయం పడుతుందన్నారు. ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. అందువల్ల నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల తరువాతే ఫలితాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. తొలి ఫలితం విశాఖ పశ్చిమ నుంచి రావచ్చునని, చివరగా భీమిలి ఫలితం తేలనున్నదన్నారు. అసెంబ్లీ స్థానాలతో పోల్చితే పార్లమెంటు నియోజకవర్గ ఫలితం రావడం కొంత ఆలస్యమవుతుందన్నారు. ఏయూలోని 21 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. గాజువాక, పెందుర్తి సెగ్మెంట్‌లకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్లు నాలుగో తేదీ ఉదయం బందోబస్తు మధ్య ఏయూలో కౌంటింగ్‌ కేంద్రాలకు తీసుకువస్తామన్నారు. పార్లమెంటుకు 104, అసెంబ్లీ సెగ్మెంట్లకు 98, పోస్టల్‌ బ్యాలెట్లకు 51 టేబుళ్లు ఏర్పాటుచేశామని వెల్లడించారు. ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళి మేరకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వారి తరపున ఏజెంట్లు నడుచుకోవాలని కోరారు. నాలుగో తేదీ ఉదయం ఆరు గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్‌ హాళ్ల వద్దకు రావాలన్నారు. ఒకసారి కౌంటింగ్‌ హాలులోనికి వెళ్లే ఏజెంట్లు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బయటకు రాకూడదని, ఒకవేళ వస్తే తిరిగి లోపలకు వచ్చేందుకు అనుమతి ఉండదన్నారు. అధికారులు జారీచేసిన గుర్తింపు కార్డులు తనిఖీ చేసిన తరువాతే లోపలకు అనుమతిస్తామన్నారు. సాధారణ వాచీలు తప్ప డిజిటల్‌ వాచీలు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలను అనుమతించేది లేదన్నారు. సాధ్యమైనంత వరకూ సెల్‌ఫోన్లు తీసుకురాకుండా ఉంటే మంచిదని పేర్కొంటూ ఒకవేళ తీసుకువచ్చినా వాటిని బయట ఒక కౌంటర్‌లో డిపాజిట్‌ చేయాలన్నారు. సెల్‌ఫోన్ల భద్రతకు తాము గ్యారంటీ ఇవ్వబోమని స్పష్టంచేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు తరలింపు మొత్తం ప్రక్రియ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.

పార్లమెంటుకు 104, ఏడు అసెంబ్లీ స్థానాలకు 98, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు 51 టేబుళ్లు ఏర్పాటుచేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు క్రమశిక్షణతో మెలగి లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని కోరారు. గొడవలు సృష్టించేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఆర్వో అనుమతి లేకుండా ఎవరూ లోపలకు రాకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉందని గుర్తుచేస్తూ ఓట్ల లెక్కింపు తరువాత విజేతలైన అభ్యర్థులు, రాజకీయ పార్టీల విజయోత్సవ ర్యాలీలు, మందుగుండు సామగ్రి కాల్చడం నిషేధించామన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నియమావళి మేరకు నడుచుకోవాలని కలెక్టర్‌ కోరారు. ప్రశాంతమైన నగరంగా విశాఖకు పేరుందని, ఇప్పటివరకూ జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. ఈ నెల ఆరోతేదీ వరకు కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మూడో తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి నాలుగో తేదీ అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి ఒక విడత శిక్షణ ఇచ్చామని, ఆదివారం రెండో విడత శిక్షణ ఇచ్చి ర్యాండమైజేషన్‌ పూర్తిచేస్తామన్నారు. సిబ్బందిని కౌంటింగ్‌ హాళ్ల వద్దకు తీసుకువెళ్లి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో వివరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌ విభాగం తరపున మూడంచెల భద్రత ఏర్పాటుచేశామన్నారు. కొత్తగా నగరానికి మరో కంపెనీ కేంద్ర బలగాలు, రాష్ట్రానికి చెందిన రెండు ప్లాటూన్ల స్పెషల్‌ పోలీసులను రప్పించామన్నారు. ఓట్ల లెక్కింపునకు వచ్చే ఏజెంట్లు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల వాహనాల పార్కింగ్‌కు సెంటర్లను గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్‌ జరిగే కేంద్రాలకు రెండు కిలోమీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌ అమలులో ఉందని, ఇప్పటికే ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. సెల్‌ ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించబోమన్నారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని కోరారు. ఎవరైనా సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చిన తరువాత కూడా రెచ్చగొట్టే సందేశాలు, పోస్టులు పెట్టవద్దని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 01:26 AM