Share News

మొక్కజొన్న సాగుకు అదును

ABN , Publish Date - May 25 , 2024 | 12:58 AM

జిల్లాలో మొక్కజొన్న నాటుకునేందుకు ఇది అనుకూల సమయమని ప్రాంతీయ వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 5,500 హెక్టార్లలో ఈ పంట పండిస్తున్నారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట తరువాత రాజ్‌మా, వలిసెలు సాగుచేసుకుంటే మంచి దిగుబడి లభించి, ఆశించిన లాభాలు వస్తాయంటున్నారు.

మొక్కజొన్న సాగుకు అదును
పరిశోధన స్థానంలో సాగుచేస్తున్న వేసవి మొక్కజొన్న (ఫైల్‌)

జూన్‌ ఆఖరు వరకు నాట్లకు అనుకూలం

హైబ్రిడ్‌ విత్తనాలతో అధిక దిగుబడులు

చింతపల్లి, మే 24:

జిల్లాలో మొక్కజొన్న నాటుకునేందుకు ఇది అనుకూల సమయమని ప్రాంతీయ వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 5,500 హెక్టార్లలో ఈ పంట పండిస్తున్నారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట తరువాత రాజ్‌మా, వలిసెలు సాగుచేసుకుంటే మంచి దిగుబడి లభించి, ఆశించిన లాభాలు వస్తాయంటున్నారు.

మొక్కజొన్న సాగుకు ఎర్ర నేలలు, లోతైన మధ్యరకపు రేగడి నేలలు, మురుగునీరు పోయే నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకూ ఉన్న నేలలు అత్యంత అనుకూలం.

ఏజెన్సీకి దీర్ఘకాలిక రకాలు(100-120రోజులు): డీహెచ్‌ఎం-113, బయో-9681, 900ఎంగోల్డ్‌, మధ్యకాలిక రకాలు(90-100రోజులు):డీహెచ్‌ఎం-111, 119, కేహెచ్‌-510, 9541, బయో-9637, ఎంసీహెచ్‌-2, కోహినూర్‌, కేఎంహెచ్‌-25కె60 స్వల్పకాలిక(90రోజులకన్న తక్కువ): డీహెచ్‌ఎంఎం-1, వీఎల్‌49, ఎంఎంహెచ్‌-133, 3342,

విత్తే కాలం... పద్ధతి

ఖరీఫ్‌ ప్రారంభం మే నెలాఖరు, జూన్‌ చివరి వరకూ నా ట్లు వేసుకోవచ్చు. 2 సెం.మీలోతు బోదెసాళ్లలో విత్తుకోవాలి. ఎకరానికి హైబ్రీడ్‌ ఏడు నుంచి ఎనిమిది కేజీలు, తీపిజొన్న అయితే మూడు నుంచి నాలుగు కిలోలు, పేలాల మొక్క జొన్న ఐదు కేజీలు అవసరమవుతాయి. ఎకరానికి 175 కేజీల యూరియా, 150 కేజీల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 35 కేజీలు మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి.

కలుపు నివారణ ఇలా..

పంట విత్తిన తర్వాత రెండు రోజులలోపు అట్రాజెన్‌ కలు పు మందును నేలరకాన్ని బట్టి 800-1200గ్రాములు ఎకరా నికి 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనం నాటిన 30రోజుల తర్వాత 2-4-డి సోడియం సాల్ట్‌ 0.5 కిలో లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తనం నాటిన 30 నుంచి 45 రోజులకు కల్టివేటర్‌తో అంత ర కృషిచేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. మొక్క జొన్న కోసిన తరువాత అదే పొలంలో రెండో పంటగా రాజ్‌ మా, చిక్కుళ్లు, వలిసెల పంటలను సాగుచేయాలి. మొక్క జొన్నకు పూతకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో నీరు పెట్టడం అవసరం.

చీడపీడలు, నివారణ:

కాండం తొలుచు పురుగు: మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు నీటిలో కలిపి 10-12రోజుల తర్వాత పిచికారీ చేయాలి. ఎకరానికి కార్బోప్యూరాన్‌ 3 కేజీలు ఆకు సుడులలో వేసుకోవాలి.

హైబ్రిడ్‌ విత్తనాలే మేలు

గిరిజన ప్రాంతంలో మొక్కజొన్న వితనాలు అందుబా టులో లేవు. హైబ్రీడ్‌ రకాలు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయి. రైతులు మేలుజాతి విత్తనాలను నాటుకోవాలి. రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే గిరిజన ప్రాంతానికి అనువైన రకాలను సిరఫారసు చేస్తాం.

- శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి, చింతపల్లి.

Updated Date - May 25 , 2024 | 12:58 AM