Share News

చర్చలకు ముందుకురాని ‘అదానీ’

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:54 AM

అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరింది.

చర్చలకు ముందుకురాని ‘అదానీ’

  • గంగవరం పోర్టులో కొనసాగుతున్న నిర్వాసిత కార్మికుల సమ్మె

  • భారం జిల్లా అధికారులపైకి నెట్టి చోద్యం చూస్తున్న యాజమాన్యం

  • పైగా సమ్మెకు సహకరిస్తున్నారని ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌

  • మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు బదిలీ

  • మరోవైపు కలెక్టర్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన నిర్వాసిత కార్మికులు

  • వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు అంగీకరిస్తే సమ్మె విరమిస్తామని స్పష్టీకరణ

  • సమస్య కొనసాగితే ఎన్నికలు బహిష్కరిస్తామని వెల్లడి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరింది. అందోళనకారులంతా చర్చలకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తుంటే...పోర్టు యాజమాన్యం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కార్మికుల డిమాండ్లపై నోరు విప్పడం లేదు. ఈ సమస్యలో తాము జోక్యం చేసుకోబోమని, రాష్ట్ర, జిల్లా అధికారులే పరిష్కరించాలన్నట్టుగా వ్యవహరిస్తోంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఎంత నష్టం జరిగితే తనకు అంత లాభం అన్నట్టు ఉంటోంది.

కలెక్టర్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన కార్మికులు

నిర్వాసిత కార్మికులతో విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఆదివారం సాయంత్రం చర్చలు జరిపారు. పోర్టులో రెండు లక్షల టన్నుల కోల్‌ ఉండిపోయిందని, అందులో 40 శాతం వెంటనే కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా తరలించేందుకు సహకరించాలని కోరారు. అలా చేస్తే పోర్టు యాజమాన్యంతో తాను చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే దానికి కార్మికులు అంగీకరించలేదు. గత ఏడాది ఆగస్టులో ఇలాగే చర్చలు జరిపి తీర్మానం చేశారని, ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే రూ.25 లక్షల పరిహారం ఇవ్వడానికి పోర్టు ప్రతినిధులు అంగీకరించారని, దానిని అమలు చేయలేదని ఆరోపించారు. ఆ తీర్మానం తరువాత ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే అందులో ఒక్కరికే రూ.8 లక్షలు ఇచ్చి మోసం చేశారని, పోర్టు యాజమాన్యం మాటపై నిలబడడం లేదని, అందుకే తాము ఒప్పుకోవడం లేదని స్పష్టంచేశారు.

కార్మిక శాఖ కార్యాలయంలో చర్చలు

విశాఖపట్నం కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వాసిత కార్మికులతో చర్చలు జరిపారు. స్టీల్‌ప్లాంటు ఇబ్బందుల్లో ఉన్నందున సహకరించాలని, సమ్మె విరమించాలని ఆయన కోరారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మె చేయడం తగదని చెప్పారు. దీనికి కార్మికులు బదులిస్తూ, గతంలో 64 రోజులు సమ్మె చేసినా సమస్యలు పరిష్కరించలేదని, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. తమను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు రమ్మని చెప్పినందున ఒక్కొక్కరికి రూ.50 లక్షలు కావాలని అడిగామని, అనేక చర్చలు జరిపిన మీదట రూ.35 లక్షలకు దిగి వచ్చామన్నారు. పోర్టు యాజమాన్యం దానికి అంగీకరిస్తే ఈ క్షణమే సమ్మె విరమిస్తామన్నారు. డబ్బులు కూడా వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదని, నెల రోజులు గడువు తీసుకొని ఇవ్వవచ్చునన్నారు. ఇంతకు మించి తాము చెప్పేదేమీ లేదని పేర్కొంటూ అదే డిమాండ్‌తో కార్మిక శాఖ అధికారికి లేఖ సమర్పించారు. సమస్యను ఇలాగే కొనసాగిస్తే ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలను కూడా తాము బహిష్కరిస్తామని స్పష్టంచేశారు.

కార్మికులపై యాజమాన్యం వేటు

అదానీ గంగవరం పోర్టులో రెండు వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. వారిలో నిర్వాసిత కార్మికులు 500 మంది. వీరు కాకుండా మిగిలిన వారిని యాజమాన్యమే నియమించుకుంది. నిర్వాసిత కార్మికుల సమ్మె మొదలైన తరువాత వారి నాయకుల్లో 12 మందిపై పోలీసులతో కేసు పెట్టించారు. ఆపరేషన్లు నిలిచిపోవడానికి లోపల కూడా కొంతమంది సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరో ముగ్గురిని పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఝార్ఖండ్‌లకు బదిలీ చేశారు. దీనిని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇప్పుడు మిగిలిన ఉద్యోగులు కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తుంటే...దానిపై చర్చించలేమని పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కక్ష సాధింపులు మానేసి, పక్కనే ఉన్న విశాఖపట్నం పోర్టు మాదిరిగా న్యాయమైన వేతనాలు ఇవ్వాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 01:54 AM