Share News

అసలేం జరిగింది

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:24 AM

నగర పరిధిలోని కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లమో విద్యార్థిని ఆత్మహత్యకు కారకులెవరనే చర్చ జరుగుతోంది.

అసలేం జరిగింది

చైతన్య ఇంజనీరింగ్‌/డిప్లొమా కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యపై సర్వత్రా చర్చ

ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు మూడు నెలల కిందటే ప్రిన్సిపాల్‌కు మౌఖికంగా ఫిర్యాదు

అయినా పట్టించుకోని వైనం...దాంతో మరింత శ్రుతిమించిన వ్యవహారం

ఈ క్రమంలోనే బలవన్మరణం

ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఏదో కారణంతో తమను తాకుతుంటారని చీటీల ద్వారా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థినులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లమో విద్యార్థిని ఆత్మహత్యకు కారకులెవరనే చర్చ జరుగుతోంది. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్లమో మొదటి సంవత్సరం చదువుతున్న అనకాపల్లి జిల్లా నాతవరం మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక గత నెల 28వ తేదీన కళాశాల హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ నూనెల శంకరరావు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు శరీరాన్ని తాకుతున్నాడంటూ మూడు నెలల కిందట ప్రిన్సిపాల్‌ వద్దకు వెళ్లి ఆమె మౌఖికంగా ఫిర్యాదు చేసింది. కానీ బాలిక ఫిర్యాదును ప్రిన్సిపాల్‌ సీరియస్‌గా తీసుకోకపోవడంతో శంకరరావు ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు వెనుకాడారు. తాము ఫిర్యాదు చేసినా ఫ్యాకల్టీ అంతా ఒకటే అనే భావన అందరికీ కలిగింది. మరోవైపు శంకరరావు ఆగడాలు శ్రుతిమించాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చదువు మానేసి ఇంటికి వచ్చేయమంటారు కాబట్టి, వారి కలలను సాకారం చేయకుండా వారి ముందు తిరిగితే జీవితాంతం బాఽధపెట్టినట్టు అవుతుందని భావించి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. గత నెల 28న ఉదయం ఎనిమిది గంటలకు కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూమ్‌కు వెళ్లిన బాలిక రాత్రి ఎనిమిది గంటలు వరకూ బయటకు రాకుండా ఉండిపోయింది. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి బాలిక రాకపోయినప్పటికీ కనీసం వార్డెన్‌ పట్టించుకోలేదు. అలాగే తరగతులకు హాజరుకాకపోయినా, ఉదయం నుంచి రాత్రి వరకూ బాలిక ఆచూకీ లేకపోయినా సిబ్బంది అప్రమత్తం కాలేదు. అదేరోజు రాత్రి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తన తండ్రికి వాట్సాప్‌లో మెసెజ్‌ పెట్టి, కాలేజీ హాస్టల్‌ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా అనే లోపాలు బయటపడ్డాయి. హాస్టల్‌ విద్యార్థినులందరూ లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు మృతురాలు తన తండ్రికి పంపిన మెసేజ్‌లో పేర్కొనడంతో పోలీసులు ఈ అంశంపై బాలికలను విచారించారు. ఎవరూ నోరు విప్పడానికి ముందుకు రాకపోవడంతో వారందరితో పేర్లు లేకుండా చీటీల రూపంలో ఎవరెవరు లైంగికంగా వేధిస్తున్నారనే దానిపై సమాచారం సేకరించారు. దీనిప్రకారం కెమిస్ర్టీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ శంకరరావు ఏదో కారణంతో తమను తాకుతున్నట్టు విద్యార్థినులు చీటీల్లో రాయడంతో...అతనే ఆ బాలికను కూడా వేధించినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే శంకరరావు అకృత్యాలపై ప్రిన్సిపాల్‌ గుల్లిపల్లి బాను ప్రవీణ్‌కు బాలిక మౌఖికంగా ఫిర్యాదుచేసినా, నిర్లక్ష్యం వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. హాస్టల్‌ మూడో అంతస్తులో వార్డెన్‌ మాత్రమే ఉండడానికి గదిని కేటాయిస్తే ఆమె భర్త కూడా అందులోనే ఉంటున్నాసరే యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే హాస్టల్‌లో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడడం, ఫైర్‌ సేఫ్టీ, టెర్రస్‌పైకి వెళ్లకుండా గేటు ఏర్పాటుచేసి తాళం వేయాల్సి ఉన్నా వాటిని యాజమాన్యం విస్మరించినట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని కనిపించనప్పుడు యాజమాన్యం ఆమెను వెతకడం కోసం 112, డయల్‌ 100కి గానీ ఫోన్‌ చేయకపోవడం, తమకు ఫిర్యాదు చేయకపోవడాన్ని కూడా తీవ్రమైన నిర్లక్ష్యంగానే పోలీసులు పరిగణించారు. అదే బాలికను ఉదయం లేదా మధ్యాహ్నం గుర్తించే ప్రయత్నం చేసినా ఆమెను కాపాడేందుకు వీలుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 01:25 AM