Share News

వేరుశనగ సాగు విస్తరణకు కార్యాచరణ

ABN , Publish Date - May 22 , 2024 | 12:27 AM

ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండలాల్లో వేరుశనగ సాగు విస్తరణకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ కలిగిన కె-7 బోల్డ్‌ విత్తనాలను రైతులకు మినీ కిట్ల రూపంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రానున్న రోజుల్లో అత్యధిక దిగుబడినిచ్చే నూతన వంగడాన్ని కూడా అందజేయాలని పరిశోధన స్థానంలో కదిరి లేపాక్షి రకంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

వేరుశనగ సాగు విస్తరణకు కార్యాచరణ
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ప్రయోగాత్మక సాగు చేస్తున్న కదిరి లేపాక్షి వేరుశనగ(ఫైల్‌)

- రైతులకు కె-7 బోల్డ్‌ రకం విత్తనం పంపిణీకి చర్యలు

- ఎకరాకి 16-18 క్వింటాళ్ల దిగుబడి

- పరిశోధన స్థానంలో కదిరి లేపాక్షిపై పరిశోధనలు

చింతపల్లి, మే 21: ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండలాల్లో వేరుశనగ సాగు విస్తరణకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ కలిగిన కె-7 బోల్డ్‌ విత్తనాలను రైతులకు మినీ కిట్ల రూపంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రానున్న రోజుల్లో అత్యధిక దిగుబడినిచ్చే నూతన వంగడాన్ని కూడా అందజేయాలని పరిశోధన స్థానంలో కదిరి లేపాక్షి రకంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల గిరిజన మండలాల్లో 20 ఏళ్లగా అతి తక్కువ విస్తీర్ణంలో గిరిజన రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో దేశవాళీ రకాల వేరుశనగను సాగు చేస్తున్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 1,980 వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగు జరుగుతోంది. రైతులు సాగుచేస్తున్న వేరుశనగ ఎకరాకు కేవలం ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే రైతులు పొందుతున్నారు. దీంతో ఈ పంటను వాణిజ్యసరళిలో సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. గిరిజన ప్రాంతాల వాతావరణం, నేలలు వేరుశనగ సాగుకు అత్యంత అనుకూలమని పరిశోధన ద్వారా గుర్తించారు. దీంతో గిరిజన రైతులతో వేరుశనగను వాణిజ్య సరళిలో సాగుచేసేలా ప్రోత్సహించేందుకు నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందజేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన జోనల్‌ స్థాయి పరిశోధన, విస్తరణ సలహా మండలి(జెడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశాల్లో అత్యధిక దిగుబడి, గింజ పెద్ద పరిమాణంలోనున్న కె-7బోల్డ్‌ రకం విత్తనం రైతులకు అందజేయడంతో పాటు సాగు విస్తీర్ణం పెంపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. కే-7బోల్డు రకం నూతన వంగడాలపై పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించారు. దీంతో ఈ రకం విత్తనం ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి మినీ కిట్ల రూపంలో పంపిణీ చేసి సాగును విస్తరింపజేసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.

ఎకరానికి 16-18 క్వింటాళ్ల దిగుబడి

నూతన వేరుశనగ రకాలు కె-7బోల్డ్‌ ఎకరానికి 16-18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం రైతులు సాగుచేస్తున్న దేశవాళి రకాలు కనీసం ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడంలేదు. ఈ నూతన విత్తనాలను రైతులు సాగుచేసుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మార్కెట్‌లో అధిక డిమాండ్‌

నూతన రకాలైన కె-7 బోల్డ్‌ రకాలకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ లభిస్తోంది. గింజ పరిమాణం సాధార గింజలకంటే రెట్టింపు వుంటోంది. ఈ గింజల్లో దాదాపు 75 శాతానికిపైగా నూనె కలిగి వుంటోంది. ఈ నూతన రకాల్లో పోషక విలువలు కూడా సాధాన గింజలకంటే రెట్టింపు వున్నాయి. చీడపీడలు ఆశించడం లేదు. ఒక మొక్క నుంచి కనీసం అర కిలోకుపైగా దిగుబడి వస్తోంది. కాయ పరిమాణం కూడా పెద్దగా వుండడంతో ఈ గింజలకు మార్కెట్‌లో కిలో రూ.200కిపైగా ధర లభిస్తుంది.

నూతన వంగడంపై పరిశోధన

పరిశోధన స్థానంలో వేరుశనగలో అత్యధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘కదిరి లేపాక్షి’పై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మక సాగులో ఎకరాకు 18- 20 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు గుర్తించారు. ఈ రకం ప్రధానంగా తెగుళ్లు, చీడపీడలను తట్టుకుంటుంది. గింజల్లో 51 శాతం నూనె శాతం ఉంటుంది. ప్రయోగాత్మక సాగులో శాస్త్రవేత్తలు ఉత్తమ ఫలితాలు సాధించారు.

Updated Date - May 22 , 2024 | 12:27 AM