Share News

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:51 AM

వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, గుర్తించిన తాగునీటి సమస్యలను ఈ నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో తాగునీటి సమస్యలపై గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకూడదన్నారు.

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత

- నెలాఖరుకు సమస్యలు పరిష్కరించాలి

- అధికారులకు కలెక్టర్‌ విజయసునీత ఆదేశం

పాడేరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, గుర్తించిన తాగునీటి సమస్యలను ఈ నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో తాగునీటి సమస్యలపై గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకూడదన్నారు. ప్రధానంగా జాతీయ రహదారి పనులు చేపడుతున్న క్రమంలో పాడైన పైపు లైన్లను, జిల్లా కేంద్రం పాడేరులో సుమారుగా కిలో మీటరు మేర పాడైన పైపులైన్లను తక్షణమే బాగు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 228 బోర్లు పని చేయడం లేదని, వాటిని ఈ నెలాఖరు నాటికి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మోటార్లు పాడై నిరుపయోగంగా ఉన్న నీటి పథకాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టి ఆయా ప్రాంతాల్లో తాగునీటిని అందించాలన్నారు. సోలార్‌ నీటి పథకాలకు నిర్వహణ సక్రమంగా చేపట్టి వినియోగం కొనసాగించాలని జిల్లా, డివిజనల్‌ పంచాయతీ అధికారులకు సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కొండ శిఖర గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

జిల్లాలో కొండ శిఖర గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు, సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ విజయసునీత ఆదేశించారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో రాచకిండాం గ్రామంలోని తాగునీటి పథకానికి విద్యుత్‌ సదుపాయం కల్పించకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదని గుర్తు చేశారు. అలాగే జిల్లాలో వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, మండలాల్లో బోర్‌ మెకానిక్‌లు లేకపోవడం వల్ల ఆయా మండలాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అక్కడ బోర్‌ మెకానిక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు తాగునీటిని అందించే విషయంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంగా వ్యవహరించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ లీలాకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, డీఎల్‌డీవో శాంతిలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, డీఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:51 AM