Share News

లంబసింగిలో వసతుల కల్పనకు చర్యలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:15 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని, స్వదేశీ దర్శన్‌ ద్వారా పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలిపారు.

లంబసింగిలో వసతుల కల్పనకు చర్యలు
చెరువులవేనం వ్యూపాయింట్‌ను ఐటీడీఏ పీవో అభిషేక్‌, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి ప్రారంభిస్తున్న ఎంపీ మాధవి

స్వదేశీదర్శన్‌ ద్వారా అభివృద్ధి

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

చింతపల్లి, మార్చి 4: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని, స్వదేశీ దర్శన్‌ ద్వారా పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలిపారు. సోమవారం చెరువులవేనం, లంబసింగి ఘాట్‌ బోడకొండమ్మ దేవాలయం వద్ద రూ.65.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన వ్యూపాయింట్లు, మరుగుదొడ్లను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి అందాలకు నిలయంగా పేరొందిన లంబసింగి, చెరువులవేనం పర్యాటక ప్రాంతాలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతి ఏటా శీతాకాల సీజన్‌లో ఈ ప్రాంతాలను లక్షల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన స్వదేశీదర్శన్‌లో లంబసింగిని ఎంపిక చేసిందని చెప్పారు. ఇందులో భాగంగా లంబసింగి, అరకు ప్రాంతాల్లో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. లంబసింగి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, ఆర్థిక అభివృద్ధి సాధిస్తారన్నారు. ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ మాట్లాడుతూ చెరువులవేనాన్ని అందంగా ఉంచేందుకు స్థానిక యువత ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు అవసరమైన టీ, అల్పాహారం, గిరిజన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను ఆదివాసీ యువత ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపాధి పొందవచ్చునన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ లంబసింగిని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదన్నారు. తాజాగా భీమనాపల్లి నుంచి చెరువులవేనం గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించేందుకు సుమారు రూ.80 లక్షల నిధులను గిరిజన సంక్షేమశాఖ మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఈ చాణిక్యరావు, ఏఈఈ రఘునాథరావు నాయుడు, వైసీపీ నియోజక వర్గం సమన్వయకర్త విశ్వేశ్వరరాజు, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, డీటీ రాజ్‌ కుమార్‌, స్థానిక సర్పంచ్‌ కొర్ర శాంతి పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:15 PM