Share News

ఏపీఐఐసీ భూమి స్వాధీనం

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:41 AM

వైసీపీ నాయకుల అక్రమాలపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ కొరడా ఝళిపిస్తున్నారు. ఏపీఐఐసీ భూముల్లో గత ఐదేళ్లుగా వైసీపీ నాయకుడు ఆక్రమించి, సాగు చేస్తున్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీఐఐసీ భూమి స్వాధీనం
స్థలాన్ని ఖాళీ చేయిస్తున్న ఏపీఐఐసీ అధికారులు

వైసీపీ నేత కబంధ హస్తాల్లో పది ఎకరాలు

ఐదేళ్లుగా పట్టించుకోని ఏపీఐఐసీ అధికారులు

ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఆదేశంతో కదిలిన యంత్రాంగం

లంకధర్మవరం ఆలయ భూములపైనా ఆరా

వివరాలివ్వాలని తహసీల్దార్‌కు ఆదేశం

వైసీపీ నేతలకు సహకరించిన అధికారుల్లో మొదలైన ఆందోళన

అచ్యుతాపురం, జూలై 5: వైసీపీ నాయకుల అక్రమాలపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ కొరడా ఝళిపిస్తున్నారు. ఏపీఐఐసీ భూముల్లో గత ఐదేళ్లుగా వైసీపీ నాయకుడు ఆక్రమించి, సాగు చేస్తున్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే లంక ధర్మవరంలో ఆలయ భూముల వివరాలను ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించడంతో వైసీపీ నేతలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల్లో పది వేల ఎకరాలను ఏపీఐఐసీ రైతుల నుంచి సేకరించింది. ఈ భూములకు పరిహారంతో పాటు పునరావాసం కూడా కల్పించింది. రైతుల నుంచి సేకరించిన భూమిని వివిధ కర్మాగారాలకు ఇవ్వగా, పది ఎకరాలు భూమి ఖాళీగా ఉంది. ఈ భూమిపై దిబ్బపాలెం పంచాయతీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనుంగ శిష్యుడు కన్ను పడింది. ఈ భూమిలో రెండు పెద్ద బావులతోపాటు ఏపుగా పెరిగిన కొబ్బరి తోట మధ్యలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి. దీంతో ఆ నాయకుడు కొబ్బరి తోటల మధ్యలో పాకలు వేసి తన కుటుంబ సభ్యులను పెట్టాడు. అంతేకాకుండా 35 వరకు గేదెలను కొని అక్కడే ఉంచాడు. బావుల్లో నీరు ఉండడంతో మునగతోట వేశాడు. ఈ భూమి ఏపీఐఐసీ స్వాధీనం చేసుకోక ముందు రాంబిల్లి మండలం గురజాపాలెం పరిధిలో ఉండేది. అప్పట్లో సాగురైతులకు భూమితోపాటు, బావులు, కొబ్బరి, జీడిమామిడి, మామిడి చెట్లకు కూడా అధికారులు పరిహారం ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు ఆక్రమణలో ఉన్న కొబ్బరి, మామిడి, జీడిమామిడి చెట్ల ఫలసాయం ఏసీఐఐసీకి చెందాలి. కానీ వైసీపీ అధినాయకుడి ఒత్తిడితో ఏపీఐఐసీ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాక ఈ భూమి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) కార్యాలయం వెనుక ఉన్నందున ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న బావుల్లో నీటిని ట్యాంకర్ల ద్వారా సెజ్‌లో నిర్మిస్తున్న కర్మాగారాలకు విక్రయించేవారు. ఒక ట్యాంకరు నీటిని రూ.వెయ్యికి విక్రయించేవారు. ఈ భూముల ద్వారా వైసీపీ నాయకుడుకు నెలకు భారీ మొత్తంలో ఆదాయం వచ్చేది. దీనిని గత ఏప్రిల్‌లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. అయినా ఏపీఐఐసీ అధికారులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో కొత్తగా ఎమ్మెల్యే అయిన సుందరపు విజయకుమార్‌ ఏసీఐఐసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఏర్పాటైన కర్మాగారాల వివరాలు సేకరించారు. అలాగే వైసీపీ నాయకుడు ఆక్రమించిన పదెకరాల స్థలం గురించి ప్రస్తావనకు వచ్చింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో స్థలాన్ని ఏసీఐఐసీ అధికారులు యుద్ధప్రాతిపదికన ఖాళీ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా లంక ధర్మవరంలో సుమారు ఏడెకరాల దేవాలయ భూమిని వైసీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు, ధర్మకర్తల మండలిలో కొందరు కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృషించి ఒక రియల్టర్‌కి విక్రయించేశారు. ఇక్కడ ఎకరా రూ.రెండు కోట్లు పలుకుతుండగా.. ఎకరా కేవలం రూ. 12 లక్షలకే విక్రయించేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల కథనం రావడంతో రికార్డులు పరిశీలించి, వివరాలు తనకు చూపించాలంటూ ఎమ్మెల్యే విజయకుమార్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇలా వైసీపీ నాయకుల అక్రమాలపై ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటుండడంతో అప్పట్లో నేతలకు సహకరించిన అధికారుల వెన్నులో దడ మొదలైంది.

Updated Date - Jul 06 , 2024 | 12:41 AM