Share News

కొనసాగిన ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:33 AM

జీవీఎంసీ జోన్‌-2 కమిషనర్‌ పొందూరు సింహాచలం నివాసంతోపాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. తొలిరోజు రూ.రెండు కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించిన ఏసీబీ అధికారులు...బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

కొనసాగిన ఏసీబీ సోదాలు

జోనల్‌ కమిషనర్‌ సింహాచలానికి సంబంధించిన మరికొన్ని ఆస్తులు గుర్తింపు

ఎచ్చెర్లలో అర ఎకరా వ్యవసాయ భూమి, శ్రీకాకుళంలో మేనల్లుడి పేరుతో ఫ్లాట్‌

నిందితుడికి పదో తేదీ వరకూ రిమాండ్‌

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ జోన్‌-2 కమిషనర్‌ పొందూరు సింహాచలం నివాసంతోపాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. తొలిరోజు రూ.రెండు కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించిన ఏసీబీ అధికారులు...బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటలోని వియ్యంకుని ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు...ఆ ప్రాంతంలో సింహాచలానికి అర ఎకరా వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దానిని 2003లో సింహాచలం కొనుగోలు చేశారు. అలాగే సింహాచలం తన మేనల్లుడు పేరిట శ్రీకాకుళం పట్టణంలో ఒక ఫ్లాట్‌ను 2013లో కొనుగోలు చేశారు. ఆ ఫ్లాట్‌ను తానే కొనుగోలు చేసినట్టు సింహాచలం అంగీకరించారు. ఆ ఫ్లాట్‌ నెలవారీ అద్దె సింహాచలం అకౌంట్‌కే జమ అవుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రెండు రోజుల సోదాల్లో రూ.2.5 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించామని, వాటి మార్కెట్‌ విలువ రూ.30 కోట్లు వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సింహాచలాన్ని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా వచ్చే నెల పదో తేదీ వరకూ రిమాండ్‌ విధించినట్టు డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 01:33 AM