Share News

పడకేసిన పనులు

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:42 AM

మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే), హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణ పనులు చాలా చోట్ల అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ భవనాలు ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

పడకేసిన పనులు
అసంపూర్తిగా ఉన్న పానిరంగిని గ్రామ సచివాలయ భవనం

మండలంలో నిలిచిపోయిన ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు

అసంపూర్తిగా దర్శనమిస్తున్న సచివాలయ, ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు

బిల్లులు మంజూరుకాకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టర్లు

అరకులోయ, మార్చి 25: మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే), హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణ పనులు చాలా చోట్ల అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ భవనాలు ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

మండలానికి 18 గ్రామ సచివాలయాలు, 18 రైతు భరోసా కేంద్రాలు, 8 హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు మంజూరయ్యాయి. 2019 డిసెంబరు 17న గ్రామ సచివాలయాల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 18 గ్రామ సచివాలయాలకు రూ.7.20 కోట్లు, 18 రైతు భరోసా కేంద్రాలకు రూ.3.92 కోట్లు, 8 హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాలకు రూ.1.19 కోట్లు కేటాయించినట్టు అప్పట్లో ప్రకటించింది. అయితే 18 సచివాలయ భవనాలకు గాను ఆరు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి అరకొర నిర్మాణాలతో నిలిచిపోయాయి. అలాగే 18 రైతు భరోసా కేంద్రాలకు గాను ఇవి కూడా ఆరు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. ఎనిమిది హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు గాను రెండు చోట్లే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చోట్ల పనులు ప్రారంభంకాలేదు. సకాలంలో బిల్లులు మంజూరుకాకపోవడం వల్లే కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రాధాన్యతా భవనాలుగా గుర్తించిన వీటి పనులే పూర్తికాకపోతే మిగతా ప్రాజెక్టుల సంగతేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పట్లో ఈ భవన నిర్మాణాలు పూర్తికానట్టేనని చెబుతున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:42 AM