రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:28 AM
తన సోదరుడి వివాహ శుభలేఖలు బంధువులకు ఇవ్వడానికి బైక్‌పై బయలుదేరిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదం సబ్బవరం మండలంలోని అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
- సోదరుడి పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళుతుండగా ప్రమాదం
సబ్బవరం, మార్చి 2: తన సోదరుడి వివాహ శుభలేఖలు బంధువులకు ఇవ్వడానికి బైక్‌పై బయలుదేరిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదం సబ్బవరం మండలంలోని అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటపల్లి గ్రామానికి చెందిన సంగరాతి సింహాచలం, పద్మ దంపతుల కుమారులు ఈశ్వరరావు, సత్యనారాయణ ఉపాధి నిమిత్తం కొంత కాలం క్రితం గాజువాక సమీపంలోని దువ్వాడ వచ్చారు. అక్కడ ఉంటూ దగ్గర్లోని రెస్టారెంట్‌లో వంట మాస్టర్లుగా అన్నదమ్ములు ఇద్దరూ పని చేస్తున్నారు. అన్న ఈశ్వరరావుకు ఈ నెల 27న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సత్యనారాయణ అనకాపల్లిలో తన స్నేహితుడికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయాడు. బొబ్బిలిలో శుభలేఖలు ఇవ్వడానికి అతను శనివారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. సబ్బవరం మండలం ఇరువాడ వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో వెళుతుండగా ఎదురుగా వస్తున్న క్వారీ లారీ అతడిని ఢీకొంది. దీంతో అతను ఎడమ వైపు పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న డంపర్ లారీ అతని పైనుంచి వెళ్లిపోవడంతో శరీరం నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సీఐ సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.