Share News

వైసీపీలో ధిక్కార స్వరం

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:19 AM

అధిష్ఠానం నిర్ణయమే అంతిమం...అన్నట్టుండే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

వైసీపీలో ధిక్కార స్వరం

పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు

నిన్న మొన్నటి వరకూ పార్టీ పెద్దల ఎదుట మాట్లాడేందుకే భయపడే పరిస్థితి

ఏమాత్రం తేడా కనిపించినా సస్పెన్షన్లు

ఇప్పుడు అందుకు విరుద్ధమైన వాతావరణం

అధిష్ఠానం నిర్ణయాలను బహిరంగంగానే తప్పుబడుతున్న పలువురు నేతలు

వాసుపల్లికి వ్యతిరేకంగా కార్పొరేటర్ల సమావేశం

ఆయనకు టికెట్‌ ఇస్తే సహకరించబోమని ప్రకటన

దేవన్‌రెడ్డి తొలగింపుపై సుబ్బారెడ్డి ఎదుటే అసంతృప్తి గళం

ఎన్నికల వేళ అధిష్ఠానం అభద్రతా భావంలో ఉండడంతోనే చర్యలకు వెనకాడుతోందని పార్టీలో అభిప్రాయాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అధిష్ఠానం నిర్ణయమే అంతిమం...అన్నట్టుండే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల ఎదుట నోరు విప్పేందుకే భయపడిన ద్వితీయ శ్రేణి నేతలు ఏకంగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. తమకు ఇష్టం లేని నేతకు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అయినా అధిష్ఠానం చూస్తూ ఊరుకుండిపోవడం పార్టీ వర్గాలనే విస్మయపరుస్తోంది. పలువురు సీనియర్‌లు పార్టీని వీడి వెళ్లిపోతున్న తరుణంలో...సస్పెన్షన్ల పేరుతో మరికొంతమందిని బయటకు పంపడం ఎందుకనే ఉద్దేశంలో అధిష్ఠానం ఉన్నట్టుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2019 నుంచి పార్టీ పదవులతోపాటు నామినేటెడ్‌ పోస్టులను అధిష్ఠానం ఎవరికి కేటాయించినా ఎదురుచెప్పడంగానీ, తనకు ఇవ్వలేదని కినుక వహించడం గానీ ఇప్పటివరకూ వైసీపీలో లేదు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడినా, వ్యవహరించినా సస్పెండ్‌ చేస్తామని అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొయ్య ప్రసాదరెడ్డి భూసెటిల్‌మెంట్‌లో తలదూర్చారనే ఆరోపణ రావడంతో సస్పెండ్‌ చేసింది. అలాగే పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌కు సహకరించడం లేదనే అభియోగంపై 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేష్‌ను సస్పెండ్‌ చేసింది. దీంతో అధిష్ఠానానికి, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఏమాత్రం ఎదురుచెప్పినా, విభేదించినా క్రమశిక్షణాచర్యలకు గురవ్వాల్సి ఉంటుందనే భయం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉండేది. అందుకే పార్టీ నిర్ణయాల పట్ల, నేతల వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరూ బయటపడేవారుకాదు. అయితే ఎన్నికలు సమీపించేసరికి అధికార పార్టీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమకు ఇష్టంలేని నేతలకు టికెట్లు ఇస్తే వారి గెలుపునకు సహకరించేది లేదని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఏడెనిమిది మంది కార్పొరేటర్లు సమావేశం కావడమే కాకుండా ఏకంగా అధిష్ఠానానికి లేఖ పంపారు. వాసుపల్లికి టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని అల్టిమేటం ఇచ్చారు. ఆ కార్పొరేటర్లను పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి పిలిచి మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించాల్సిందేనని చెప్పగా...అందుకు కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. తాము వాసుపల్లితో కలిసి పనిచేయలేమంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో సుబ్బారెడ్డితోపాటు మిగిలిన నేతలు అవాక్కయ్యారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించని వారిపై క్రమశిక్షణాచర్యలు తప్పవంటూ అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే గాజువాకలో ఇటీవల నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఎదుటే ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గీయులు ఇన్‌చార్జి మార్పుపై తమ అసంతృప్తి వెలిబుచ్చారు. దేవన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సమావేశంలో గందరగోళం తలెత్తడంతో వైవీ సుబ్బారెడ్డి అక్కడ నుంచి నిష్క్రమించారు. అయితే అధిష్ఠానం నిర్ణయాలను నగరంలో పలువురు నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నా కనీసం షోకాజ్‌ నోటీసు ఇవ్వకపోవడం పార్టీ నేతలతోపాటు కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గతంలో సమన్వయకర్త ఆదేశాన్ని పాటించలేదని ఒక కార్పొరేటర్‌ను సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ఎదుట ధిక్కార స్వరం వినిపించినా కనీస చర్యలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్నవారు, ముఖ్యనేతలు, కార్పొరేటర్లు ఇతర పార్టీల్లోకి వలస పోతుండడంతో పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారని, ఇప్పుడు కొత్తగా ఎవరినైనా సస్పెండ్‌ చేస్తే మరింత ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతోనే చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్టున్నారని పార్టీనేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా వైసీపీలో ఆరు నెలలు కిందటి పరిస్థితికి పూర్తిభిన్నమైన వాతావరణం ఇప్పుడు ఉందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:19 AM