Share News

బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:20 AM

జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తోంది. ప్రధానంగా ఒక అధికారి, కొందరు సిబ్బందిపై ఆరోపణలు రావడంతో ఖజానా రాష్ట్ర డైరెక్టర్‌ మోహనరావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు శాఖల ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల మేరకు బాఽధ్యులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

బిగుస్తున్న ఉచ్చు
కలెక్టరేట్‌లోని జిల్లా ఖజానా కార్యాలయం

జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతిపై ఫోకస్‌

పలువురిపై ఉన్నతాధికారుల గురి

ఆడిటింగ్‌ లేకుండానే బిల్లుల అప్‌లోడ్‌

సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్‌ చేయాలంటే పైసలు పడాల్సిందే

కార్యాలయాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తోంది. ప్రధానంగా ఒక అధికారి, కొందరు సిబ్బందిపై ఆరోపణలు రావడంతో ఖజానా రాష్ట్ర డైరెక్టర్‌ మోహనరావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు శాఖల ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల మేరకు బాఽధ్యులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసులు, రోడ్లు, భవనాలు, పశుసంవర్ధకశాఖతోపాటు మరికొన్ని శాఖల నుంచి ఖజానా కార్యాలయంపై ఫిర్యాదులు వచ్చాయి. మరిన్ని శాఖల నుంచి ఫిర్యాదులు అందకపోయినా భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జీతాలతోపాటు పలు రకాల బిల్లులు పరిశీలించి, సక్రమంగా ఉన్నాయా? లేదా చూసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ప్రతి బిల్లు జూనియర్‌ అకౌంటెంట్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ముందు సీనియర్‌ అకౌంటెంట్లు ఆడిటింగ్‌ చేయాలి. కానీ చాలా బిల్లులకు ఈ పద్ధతి పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే పని ఒత్తిడి అంటూ తప్పించుకుంటున్నారు. బిల్లులు రూపొందించి అప్‌లోడ్‌ చేసే సమయంలో పొరపాట్లు ఉంటే వెంటనే వెనక్కి వస్తాయి. వాటిలో తప్పులు సవరించి తిరిగి అప్‌లోడ్‌ చేయాలంటే ఆయా శాఖల ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంటారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి తిప్పించుకుని, చేయి తడిపితేనే అప్‌లోడ్‌ చేస్తుంటారని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అన్ని శాఖల ఉద్యోగుల జీతాలు, బిల్లులు రూపొందించి అప్‌లోడ్‌ చేసే ముందు ‘ఫ్లైలీప్‌’ (టోకెన్‌ నంబర్లతో కూడిన వివరాలు ఒక రికార్డులో నమోదుచేయాలి) నిర్వహణ కిందిస్థాయి ఉద్యోగులకు అప్పగించి, పైసలు వచ్చిన ఫైళ్లను సీనియర్‌ అకౌంటెంట్లు చూస్తారన్న ఆరోపణలున్నాయి. కాగా బిల్లులు పరిశీలించి అప్‌లోడ్‌ చేసేందుకు ఆయా వ్యక్తులను బట్టి డబ్బు వసూలు చేస్తారంటున్నారు.

ఐదారు నెలల క్రితం ఒక ప్రభుత్వ శాఖలో సీనియర్‌ అధికారికి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు రకాల ప్రయోజనాల మంజూరు రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. కొందరు ఉద్యోగులు సర్వీస్‌లో చేరి పదేళ్లు కాకముందే పోష్‌ లొకాలిటీలో ఫ్లాట్లు కొనుగోలుచేశారని కొందరు చెబుతున్నారు. ఇదిలావుండగా ఖజానా కార్యాలయంపై ఆరోపణల నేపథ్యంలో పలు శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు డైరెక్టర్‌ విచారణ చేపట్టడం కలకలం రేపింది. కార్యాలయంలో అవినీతికి తెరదించాలంటే కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని పలు శాఖల ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 01:20 AM