Share News

ఓట్ల లెక్కింపుపై సంపూర్ణ అవగాహన అవసరం

ABN , Publish Date - May 30 , 2024 | 01:12 AM

ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

ఓట్ల లెక్కింపుపై సంపూర్ణ అవగాహన అవసరం
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

అనకాపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం ఓట్ల లెక్కింపుపై అధికారులకు కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 4న జరగబోయే ఓట్ల లెక్కింపునకు విధుల్లో పాల్గొనేవారు సమాయత్తం కావాలన్నారు. ఎవరికి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. లెక్కింపు జరుగుతుండగా ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఆర్వోలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా పూర్తిగా పారదర్శకంగా సాగాలన్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు సమయంలో బెల్‌ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని, ఏమైనా అనుకోని విధంగా సాంకేతిక సమస్యలు వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీసు ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, ఏఆర్‌వోలు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 01:12 AM