హాస్టళ్ల సమస్యలకు తెర!
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:22 AM
సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు మంచి రోజులు వచ్చాయి.

సాంఘిక సంక్షేమ వసతిగృహాల భవనాలకు మరమ్మతులు
జిల్లాలో 19 హాస్టళ్లకు రూ.3.16 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
విద్యుత్, కార్పొంటరీ, ప్లంబింగ్, సిమెంట్ పనులు
జనవరి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు
తొలగనున్న ఎస్సీ విద్యార్థుల ఇక్కట్లు
నర్సీపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు మంచి రోజులు వచ్చాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని భవనాలకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 19 వసతి గృహాల్లో మేజర్, మైనర్ మరమ్మతు పనులకు రూ.3.16 కోట్లు మంజూరు చేసింది. పనులు చేపట్టడానికి పరిపాలనా పరమైన అనుమతులు జారీ అయ్యాయి. జనవరి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సమగ్ర శిక్ష ఈఈ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తారు.
జిల్లాలోని సాంఘిక సంక్షేమ పరిధిలో వున్న ఎస్సీ విద్యార్థుల వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కిటికీలకు రెక్కలు లేక పోవడంతో శీతాకాలంలో చలి, దోమల బెడదతో అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే శ్లాబ్‌ల నుంచి నీరు కారుతున్నది. గచ్చులు చిత్తడిగా మారుతుండడంతో రాత్రిపూట నిద్ర పోవడానికి వీలు కావడలేదు. మరుగుదొడ్లు, స్నానపు గదుల తలుపులు ఊడి పోవడంతో పరదాలు కట్టుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వసతి గృహాల సమస్యలను పట్టించుకోకపోవడంతే ఐదేళ్లపాటు విద్యార్థులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారాకిని నిదులు మంజూరు చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏ హాస్టల్‌కు ఎన్ని నిధులు..
చోడవరంలో కళాశాల విద్యార్థుల వసతి గృహానికి రూ. 30లక్షలు, కళాశాల విద్యార్థినుల వసతిగృహానికి రూ.30 లక్షలు, వడ్డాదిలో బాలుర వసతి గృహానికి రూ.18 లక్షలు, రావికమతంలో బాలికల హాస్టల్‌కి రూ.12.5 లక్షలు, అనకాపల్లిలో కళాశాల విద్యార్థుల వసతి గృహానికి రూ.37 లక్షలు, కశింకోటలో ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహానికి రూ.16 లక్షలు, వి.మాడుగుల నియోజకవర్గం ఎ.కోడూరులో ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్‌కిరూ.16.2 లక్షలు, కె.కోటపాడులో కళాశాల విద్యార్థినుల వసతిగృహానికి రూ.5.1 లక్షలు మంజూరు చేశారు. పరవాడ, సబ్బవరంలో బాలికల వసతి గృహాలకు రూ.15 లక్షు చొప్పున రూ.30 లక్షలు మంజూరయ్యాయి. నర్సీపట్నం ఆనంద నిలయం వసతి గృహానికి రూ.13 లక్షలు, బాలుర వసతిగృహానికి రూ.20 లక్షలు, బాలికల వసతి గృహానికి రూ.12 లక్షలు, కళాశాల విద్యార్థినుల వసతి గృహానికి రూ.3 లక్షలు, వేములపూడిలో బాలురు వసతి గృహానికి రూ.13 లక్షలు, నాతవరంలో బాలుర వసతి గృహానికి రూ.16 లక్షలు, చమ్మచింతలో బాలుర వసతి గృహానికి రూ.12 లక్షలు, గొలుగొండలో బాలుర వసతి గృహానికి రూ.17 లక్షల చొప్పున మొత్తం రూ.3.16 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో వసతిగృహాల్లో విద్యుత్ వైరింగ్ పనులు, కిటికీలకు రెక్కలు, గుమ్మాలకు మర్మతులు, గదుల్లో సిమెంటు పనులు చేపట్టనున్నారు.