Share News

రైతు మెడకు స్మార్ట్‌గా ఉచ్చు!

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:48 AM

జిల్లాలో రైతులు వద్దంటున్నా వినకుండా కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకొంటూనే మరోవైపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించిన ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు భవిష్యత్తులో రైతులకు వచ్చే బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ మొత్తాలు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాలని సూచిస్తున్నారు.

రైతు మెడకు స్మార్ట్‌గా ఉచ్చు!
మునగపాక మండలం గణపర్తి గ్రామంలో వ్యవసాయ బోరు వద్ద స్మార్ట్‌ మీటరు బిగిస్తున్న దృశ్యం

- వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు వద్దని రైతులు వ్యతిరేకిస్తూ వినని అధికారులు

- గుట్టు చప్పుడు కాకుండా బిగించేస్తున్న వైనం

- ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా ఏర్పాటు

- బిల్లులు వచ్చినా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్న ఏపీఈపీడీసీఎల్‌

- ఉచిత విద్యుత్‌ అంటూనే మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రశ్నిస్తున్న రైతు కార్మిక సంఘాలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రైతులు వద్దంటున్నా వినకుండా కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకొంటూనే మరోవైపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించిన ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు భవిష్యత్తులో రైతులకు వచ్చే బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ మొత్తాలు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాలని సూచిస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో ఏపీఈపీడీసీఎల్‌ అధికారుల గణాంకాల ప్రకారం 24 మండలాల పరిధిలో 37,480 వ్యవసాయ మోటార్లు రైతుల పొలాల్లో ఉన్నాయి. వీటన్నింటికీ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు ప్రారంభించి జిల్లాలో ఇప్పటికే సుమారు 18 వేలకు పైగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించినట్టు చెబుతున్నారు. అనకాపల్లి, మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి, మునగపాక, కశింకోట మండలాల్లో సగం మంది రైతుల పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించారు. మిగిలిన మండలాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో పనులు పూర్తవుతాయని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు మీటర్లు బిగించిన రైతులకు బిల్లులు రాకపోయినా భవిష్యత్తులో ప్రతి నెలా వినియోగించిన కరెంట్‌కు బిల్లు వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బిల్లులు రైతులకు జారీ అయినా అవి చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా బిల్లు మొత్తాన్ని రైతు బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం నగదు బదిలీ చేసి రైతు వినియోగించిన విద్యుత్‌ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని, రైతుకు భారం ఉండదని స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2021లో తొలుత ప్రయోగాత్మకంగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించారు. ఆయా రైతులకు ప్రతి నెలా రూ.3 వేలు నుంచి రూ.5 వేలు వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయా బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ భవిష్యత్తులో విద్యుత్‌ సరఫరా సంస్థలు ప్రైవేటు పరమైతే రైతులపై విద్యుత్‌ బకాయిల భారం తప్పదనే అభిప్రాయాన్ని రైతు కార్మిక సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:48 AM